రాజకీయంగా బీజేపీకి చిక్కులే!

ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ల విషయంలో బీజేపీ నేతల ఎలివేషన్స్ ఒక రేంజ్ లో ఉంటాయి. ఎన్డీయే లో భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత, చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఎలివేషన్స్ ఇచ్చే పనిలోనే ఉన్నారు. తాజాగా ప్రధాని మోడీ భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు అసలు దేశానికీ మోడీ లాంటి ప్రధాని దొరకటం అదృష్టం అన్నట్లు మాట్లాడారు ఇద్దరు నేతలు. పవన్ కళ్యాణ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి మోడీ వద్దు అనుకుంటే తప్ప ఆయన్ను ఎవరూ ఓడించలేరు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కానీ గత కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే దేశ రాజకీయాల్లో ఎప్పుడూ లేని ఘటనలు చోటుచేస్తుకుంటున్నాయి. జులై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలయ్యాయి.. కానీ ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోడీ కానీ..కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా కానీ ఒక్క సారి అంటే ఒక్కసారి కూడా లోక్ సభలోకి అడుగుపెట్టలేదు. పార్లమెంట్ ప్రాంగణంలోని తమ తమ ఆఫీస్ ల్లో కూర్చుంటున్నారు కానీ సభలోకి రావటం లేదు. ఇద్దరు కీలక నేతలది ఇదే పరిస్థితి.
దేశ పార్లమెంట్ చరిత్రలో సభ జరుగుతున్న సమయంలో ఇన్ని రోజులు ప్రధాని, హోమ్ మంత్రి సభకు రాకుండా ఉన్నది ఎప్పుడూ లేదు అని సీనియర్ నేతలు చెపుతున్నారు. విచిత్రం ఏమిటి అంటే అదే పార్లమెంట్ ప్రాంగణంలో ఇప్పటికే ఎన్నో సార్లు మోడీ ఎన్డీయే సమావేశాలు పెట్టారు. కానీ సభలోకి మాత్రం అడుగుపెట్టలేదు. సమస్యలు ఉన్నప్పుడు వాటిని దైర్యం గా పేస్ చేయాలి కానీ..ఇలా పారిపోవటం...పార్లమెంట్ ను అవమానించేలా వ్యవహరించటం ఏ మాత్రం సరికాదు అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాజకీయంగా ఇది రాబోయే రోజుల్లో బీజేపీ ని మరింత ఇరకాటంలోకి నెట్టే అవకాశం ఉంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా విపక్షాలు అన్నీ కూడా ఢిల్లీ లో యువతపై జరిగిన లాఠీ చార్జికి ప్రధాని మోడీ తో పాటు హోమ్ మంత్రి అమిత్ షా లు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. దీంతో పాటు అయోధ్యలో విరాళాల చోరీ అంశం కూడా పార్లమెంట్ లో దుమారం రేపే అవకాశం ఉంది. ఈ రెండు విషయాలకు భయపడే మోడీ, అమిత్ షాలు సభకు రావటం లేదు అనే అభిప్రాయం ఎక్కువ మంది నేతల్లో కూడా ఉంది. విపక్షాలు అన్నీ కూడా వీళ్ళిద్దరూ సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
గతంలో కూడా ఒక సారి ప్రధాని మోడీ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సమాధానం ఇవ్వకుండా దూరం గా ఉన్నారు. కొంత మంది మహిళా ఎంపీలు ప్రధాని పై దాడి చేస్తారనే సమాచారం ఉండటంతోనే తానే ప్రధానిని సభకు దూరంగా ఉండాలని సూచించినట్లు స్పీకర్ ప్రకటించారు. దేశ చరిత్రలోనే ఫస్ట్ టైం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని కాకుండా మరో మంత్రి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు పలు కీలక అంశాల విషయంలో తప్పించుకునే ధోరణితో ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాలు వ్యవహరిస్తున్నారు అనే అభిప్రాయం ఎక్కువ మంది ఎంపీల్లో కూడా ఉంది. అధికార కూటమి డొల్లతనాన్ని ఇది తెలియచేస్తుంది అనే చర్చ జోరుగా సాగుతోంది. పోనీ బీజేపీ కి లోక్ సభలో బలం లేదా అంటే...ఇటీవలే టిఎంసి తో పాటు శివసేన ఉద్దవ్ ఠాక్రే ఎంపీలను కూడా చీల్చి తమ వైపు తిప్పుకున్న సంగతి తెలిసిందే. అయినా కూడా ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లు సభకు దూరంగా ఉండటం అంటే ఇది సభను అవమానించటం తప్ప మరొకటి కాదు అని..అదే సమయంలో విపక్షాలకు వీళ్ళిద్దరూ భయపడ్డారు అనే అభిప్రాయం కలగటానికి కూడా కారణం అవుతుంది అని బీజేపీ ఎంపీలు కూడా అభిప్రాయ పడుతున్నారు. ఇది ఈ ఇద్దరి కీలక నేతల బలహీనతను తెలియచేస్తోంది అని చర్చ కూడా సాగుతోంది. గతంలో కూడా సమస్యలు వచ్చినప్పుడు వీళ్ళు మౌనాన్ని ఆశ్రయించారు తప్ప ...ఎప్పుడూ వాటిపై బయటకు వచ్చి మాట్లాడిన దాఖలాలు లేవు.



