డెమాక్రాట్ల చేతికి న్యూ యార్క్ మేయర్ పీఠం

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కూడా పూర్తి కాకముందే డోనాల్డ్ ట్రంప్ కి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. వరసపెట్టి తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు...నియంత పోకడలతో అమెరికా ప్రజలు డోనాల్డ్ ట్రంప్ తీరును నిరసిస్తూ రోడ్లు ఎక్కిన సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలనే కాకుండా సొంత ప్రజలను కూడా ఆయన డోంట్ కేర్ అంటూ వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున విమర్శలు మూట కట్టుకుంటున్నారు. ఈ తరుణంలో డోనాల్డ్ ట్రంప్ కు బిగ్ షాక్ తగిలింది. స్వయంగా ఆయనే రంగంలోకి దిగి...ప్రజలను బెదిరించే ప్రయత్నం చేసినా కూడా అవేమి ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. తాజాగా వెల్లడైన అమెరికా స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార రిపబ్లికన్ పార్టీకి ప్రజలు షాక్ ఇచ్చారు. ఇందులో అత్యంత కీలకమైంది న్యూయార్క్ నగర మేయర్ ఎన్నిక. ఈ మేయర్ పదవిని డెమాక్రాటిక్ పార్టీకి చెందిన జోహ్రాన్ మమ్ దాని గెలుచుకుని సంచలనం సృష్టించారు. జోహ్రాన్ మమ్ దాని ఓడించేందుకు స్వయంగా ట్రంప్ రంగంలోకి దిగిన ఫలితం లేకుండా పోయింది.
భారతీయ, ఉగాండా మూలాలు ఉన్న జోహ్రాన్ మమ్ దాని గెలుపు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది అనే చెప్పాలి. జోహ్రాన్ మమ్ దాని మేయర్ గా గెలిస్తే కనీస అవసరాలకు సరిపడే స్థాయిలోనే నిధులు కేటాయిస్తాను అంటూ డోనాల్డ్ ట్రంప్ బెదిరించినా కూడా న్యూ యార్క్ ప్రజలు వీటిని ఏ మాత్రం పట్టించుకోలేదు అనే విషయం ఫలితాన్ని చూస్తే తెలిసిపోతోంది. అతి తక్కువ వయసులో అంటే 34 సంవత్సరాలకే న్యూ యార్క్ మేయర్ గా ఎన్నికై జోహ్రాన్ కొత్త చరిత్ర సృష్టించారు. భారతీయ సినిమా డైరెక్టర్ మీరా నాయర్ కొడుకే ఈ జోహ్రాన్ మమ్ దాని. తండ్రి ఉగాండా జాతీయుడు అయిన మహమూద్ మమ్ దాని. జోహ్రాన్ మమ్ దాని తన ప్రచారంలో ముఖ్యంగా నగర ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు ఇంటి అద్దెలను స్థిరీకరిస్తానని ప్రచారం చేశాడు. ఇవి అతను మంచి ఫలితాలను సాదించేందుకు దోహదపడ్డాయనే అంచనాలు ఉన్నాయి.
కార్పొరేట్లు..సంపన్నులపై పన్నులు పెంచి సామాన్య ప్రజల జీవన వ్యయాన్ని తగ్గించటానికి కృషి చేస్తానన్నారు. న్యూ యార్క్ నగర మేయర్‌గా ఎన్నికైన తొలి ముస్లింగా, తొలి దక్షిణాసియా సంతతి వ్యక్తిగా మమ్దానీ చరిత్ర సృష్టించారు. అమెరికా వ్యాప్తంగా ఆధిపత్య పోకడలు వేళ్లూనుకుంటున్న వేళ డెమాక్రెటిక్ పార్టీకి ఈ విజయం కొత్త జోష్ తెచ్చిపెట్టింది. గతంలో పార్టీకి దూరమైన ఉదారవాద భావజాల ప్రజలు మరోసారి డెమోక్రాట్‌లకు మద్దతుగా నిలిచారు. అమెరికాలో సంప్రదాయ వాద భావజాలం వేళ్లూనుకుంటున్న తరుణంలో వామపక్ష, పురోగామి వాద సమర్థకులైన స్వింగ్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీవైపు మొగ్గు చూపారు.



