Telugu Gateway
Top Stories

ఏఐ..ఇక మీ మనసునీ చదివేస్తుంది అట !

ఏఐ..ఇక మీ మనసునీ చదివేస్తుంది అట !
X

ఒక సినిమాలో బ్రహ్మానందం మనసులో ఏది అనుకుంటే అది అయన కొడుక్కి తెలిసిపోతుంది. బ్రహ్మానందం తన భార్యను రాత్రికి ఎలా హత్య చేయాలా అని వేసుకుంటున్న ప్లాన్ కూడా అలాగే బయటకు వస్తుంది. ఇది అంతా సినిమాలో కామెడీ కోసం చేసిన సరదా. కానీ ఇప్పుడు నిజంగా మన మనసును చదివే వ్యవస్థలు రాబోతున్నాయి. అది కూడా ఇప్పుడు పెద్ద సంచలనంగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధ) తో కూడిన సాంకేతిక పరిజ్ఞానం తో వీటిని అభివృద్ధి చేయబోతున్నారు. ఇది మెదడు ఆలోచనలను కూడా చదివేస్తుంది అన్న మాట. యూనివర్సిటీ అఫ్ టెక్సాస్ దీనికి సంబంధించి కీలక పురోగతి సాధించింది. ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనం అవుతోంది. ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల మానవాళికి పెనుముప్పు పొంచి ఉంది అన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్న వేళ ఇప్పుడు ఏకంగా మనిషి మెదడులో ఉండే ఆలోచనలకు అక్షరరూపం ఇచ్చే సాంకేతికత వస్తే అది ఎలా మారుతుందో అన్న భయాలు ఇప్పుడు నిపుణుల్లో వ్యక్తం అవుతున్నాయి.

త్వరలోనే ఈ సాంకేతిక నైపుణ్యంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెక్సాస్ యూనివర్సిటీ లోని న్యూరో సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు దీనిపై పని చేస్తున్నారు. ఏఐ రంగంలో ఇదే గొప్ప ముందడుగుగా వీరు దీన్ని చెపుతున్నారు. ఇదే అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని ఇప్పటికే ఒక జర్నల్ లో ప్రచురించారు కూడా. యూనివర్సిటీ కి చెందిన నిపుణల బృందం ముగ్గురు వ్యక్తులకు 16 గంటలు వివిధ రకాల అంశాలు చెప్పి కొన్ని పదాలకు వారి నాడులు స్పందించిన తీరును పరిశీలించారు. దీనికోసం చాట్ జీపీటి తరహాలో జీపీటి ఏఐ ని వాడారు. దీని ఆధారంగా ఆ వ్యక్తులతో మాట్లాడి పరిశీలించగా 82 శాతం మేర ఫలితాలు సానుకూలంగా వచ్చాయని వెల్లడించారు. అయితే ఈ టెక్నాలజీ తమ భావాలు వ్యక్తం చేయలేని వారికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది అని...కానీ దీన్ని ప్రభుత్వాలు, ప్రవేట్ సంస్థలు నిఘాకు వాడితే ప్రమాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Next Story
Share it