ఐటి రంగం...2023 గడ్డు కాలమే!
దిగ్గజ ఐటి కంపెనీల్లో ఉద్యోగాల కోతకు బ్రేక్ పడటం లేదు. తాజాగా ప్రముఖ ఐటి సంస్థ మైక్రోసాఫ్ట్ కూడా ఏకంగా 11000 వేలమందిని తొలగించనుంది. ఇందులో ఎక్కువ మంది ఇంజనీరింగ్ డివిజన్ లోని వారిపై వేటు పడనుంది అని చెపుతున్నారు. ప్రస్తుతం ఉన్న సిబ్బందిలో ఐదు శాతం తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా కీలక సంస్థలు అన్నీ ఉద్యోగులపై పెద్ద ఎత్తున వేటు వేస్తున్న విషయం తెలిసిందే. 2022 లో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ఐటి నిపుణులు ఉద్యోగాలు కోల్పోయారు. ఇదే ట్రెండ్ 2023 లోనే కొనసాగుతుంది అనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. వీటిని ధ్రువపర్చేలా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ 11000 తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం భయాలు వెంటాడటం, ఇప్పటికే పలు దేశాలు మాంద్యంలో చిక్కుకోవడంతో ఆర్థికవ్యవస్థలు మందగించే అవకాశం ఉంది. దీంతో ఐటి పై ఆయా దేశాలు చేసే వ్యయం కూడా తగ్గుముఖం పడుతుంది.
ఇవన్నీ ఐటి రంగంపై ప్రతికూల ప్రభావం చూపించే అంశాలే. భారత్ కు మాంద్యం భయం ఉండదు అని చెపుతున్న తాజాగా కేంద్ర మంత్రి నారాయణ్ రాణే 2023 జూన్ నాటికీ దేశం కూడా మాంద్యం బారిన పడే అవకాశం ఉంది అని చెప్పటం విశేషం .దీనిపై ప్రతిపక్షాలు కూడా కేంద్రం పై మండిపడ్డాయి. ఇంకా ఏమి విషయాలు దాస్తున్నారు అంటూ ప్రశ్నించాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఈ ఏడాది అత్యంత కీలకం అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు. అందుకే ఐటి కంపెనీలతో పాటు పలు సంస్థలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. కొంతమంది ఖర్చు తగ్గించుకోవటానికి మార్గాలను అన్వేషిస్తుంటే ..మరి కొన్ని కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నాయి. గత కొంత కాలంగా ప్రపంచ బ్యాంకు దగ్గర నుంచి పలు సంస్థలు మాంద్యం విషయాన్నీ చెపుతూ వస్తున్నాయి.