పెళ్ళిళ్లు..విందులకూ ప్రెసిడెన్షియల్ జెట్ అద్దెకు

ఆ విమానం ఖరీదు 1500 కోట్ల రూపాయలు. అమ్ముదామని విశ్వప్రయత్నాలు చేశారు. కానీ అది అమ్ముడుపోలేదు. దీంతో చేసేదేమీ లేక ఇప్పుడు ఆ ప్రెసిడెంట్ విమానాన్ని పెళ్లిళ్లు..విందులకూ అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం తీసుకున్నది మెక్సికో. మూడేళ్ళ పాటు దీన్ని అమ్మకానికి ప్రయత్నించి విఫలమైన తర్వాత ఈ ప్రెసిడెన్షియల్ జెట్ ను ఇలా ఉపయోగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ విమానాన్నిఅమ్మేందుకు అవకాశం ఉన్న అన్ని మార్గాలను అన్వేషించామని..అయినా విజయవంతం కాలేకపోయినట్లు మెక్సికో ప్రెసిడెంట్ అండ్రూస్ మాన్యెల్ లోపెజ్ అబ్రోడర్ తెలిపారు. మెక్సికో గత ప్రెసిడెంట్ ఎన్రిక్ పెనానీటో ఈ విమానాన్ని ఉపయోగించారు.
అబ్రోడర్ ఈ విమానాన్ని ఉపయోగించటానికి నిరాకరించారని ఇండిపెండెంట్ పత్రిక వెల్లడించింది. దీంతో ఇక నుంచి ప్రెసిడెన్షియల్ జెట్ విమానాన్ని ప్రజలు పెళ్ళిళ్లు, పార్టీలకు బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇది బోయింగ్ 787 విమానం. ప్రత్యేకంగా ఈ విమానంలో ప్రెసిడెంట్ అవసరాలకు అనుగుణంగా మార్పులు చేయించినందున అమ్మకం కూడా కష్టంగా మారిందని తెలిపారు. ఇందులో ప్రెసిడెన్షియల్ సూట్ తోపాటు ఇతర ప్రత్యేక ఏర్పాట్లు చేసినందున ఇందులో కేవలం 80 మంది ప్రయాణికులు మాత్రమే వీలు ఉంటుందని తేల్చారు. దీన్ని 300 మంది ప్రయాణికులు పట్టేలా తిరిగి డిజైన్ చేయించటం కూడా చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతుందని తెలిపారు.



