ప్రైవేట్ పార్టీలకు మెట్రో కోచ్ లు

పుట్టిన రోజు వేడుకలు..వార్షికోత్సవాలకు మెట్రో కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. దీని కోసం ప్రత్యేకంగా ఓ కోచ్ ను కేటాయించారు. సెలబ్రేషన్ ఆన్ వీల్స్ కార్యక్రమం కింద ఈ నిర్ణయం తీసుకున్నారు. వంద మందితో పార్టీ చేసుకుంటే ఐదు వేల రూపాయలు..ఈ సంఖ్య 200 మంది అయితే పది వేల రూపాయలుగా ఉండనుంది. మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పరిధిలోని పూణే మెట్రో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ఛార్జీలు రౌండ్ ట్రిప్ కు వర్తిస్తాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రయాణికుల నుంచే కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయం సంపాదించుకునేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. ఒక్కో మెట్రో కోచ్ సామర్ధ్యం గరిష్టంగా 320 మంది వరకూ ఉంటుందని అధికారులు తెలిపారు. మార్చి6నే ఈ మెట్రో సర్వీసులు ప్రారంభం అయ్యాయి. తాజాగా పది లక్షల మంది మెట్రో ద్వారా రాకపోకలు సాగించారు. కొత్తగా చేపట్టిన ఈ ప్రైవేట్ పార్టీల కార్యక్రమానికి మంచి ఆదరణ దక్కుతుందని భావిస్తున్నట్లు అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.



