Telugu Gateway
Top Stories

తిర‌గ‌బ‌డ్డ జుక‌ర్ బ‌ర్గ్ జాత‌కం!

తిర‌గ‌బ‌డ్డ జుక‌ర్ బ‌ర్గ్ జాత‌కం!
X

మార్క్ జుక‌ర్ బ‌ర్గ్. ప్ర‌పంచంలో పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఫేస్ బుక్,ఇన్ స్టాగ్రామ్, వాట్స‌ప్ వంటి అత్యంత పాపుల‌ర్ సోష‌ల్ మీడియా సంస్థ‌ల అధినేత అయిన మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ జాత‌కం తిరగ‌బ‌డి న‌ట్లే క‌న్పిస్తోంది. ఈ ఏడాదిలోనే ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కూ ఏకంగా భార‌తీయ క‌రెన్సీలో 5.68 ల‌క్షల కోట్లు మేర నష్ట‌పోయారు. దీంతో ప్ర‌పంచ సంప‌న్నుల జాబితాలో ఆయ‌న ఏకంగా 14 మెట్లు దిగాల్సి వ‌చ్చింది. ప్రస్తుతం జుక‌ర్ బ‌ర్గ్ సంప‌ద 55.9 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. 2021 జులైలో మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ ప్రపంచ సంప‌న్నుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్నారు. ఇప్పుడు ఏకంగా 20 స్థానానికి ప‌డిపోయారు. 2021 సెప్టెంబ‌ర్ లో ఆయ‌న సంప‌ద 142 బిలియ‌న్ డాల‌ర్ల‌కు చేరింది. ఈ ఏడాది ఇప్ప‌టికే మెటా కంపెనీ షేర్లు ఏకంగా 57 శాతం మేర న‌ష్ట‌పోయాయి. దీంతో జుక‌ర్ బ‌ర్గ్ సంప‌ద కూడా అలా ఆవిరైపోయింది.

అమెరికాకు చెందిన దిగ్గ‌జ ఐటి సంస్థ‌ల అధినేతల సంప‌ద ఈ ఏడాది భారీగా ప‌త‌నం అయింది. అయితే ఈ విష‌యంలో జుక‌ర్ బ‌ర్గ్ సంప‌ద ప‌త‌నం మ‌రీ వేగంగా ఉన్న‌ట్లు బ్లూమ్ బ‌ర్గ్ క‌థ‌నం వెల్ల‌డించింది. అమెజాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ జెఫ్ బెజోస్, గూగుల్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు లారీ పేజ్ సంప‌ద‌లు కూడా వ‌ర‌స‌గా 46 శాతం, 34 శాతం మేర త‌గ్గుముఖం ప‌ట్టాయి. అదే జుక‌ర్ బ‌ర్గ్ సంప‌ద అయితే ఏకంగా 71 శాతం మేర త‌గ్గింది. మెటా షేర్లు గ‌రిష్టంగా 382 డాల‌ర్ల‌కు చేరిన స‌మ‌యంలో ఆయ‌న సంప‌ద 142 బిలియ‌న్ డాల‌ర్ల గ‌రిష్ట స్థాయికి చేరింది. ఫేస్ బుక్ పేరును మెటా గా మార్చిన‌ప్ప‌టి నుంచే ఈ ప‌త‌నం ప్రారంభం అయింద‌నే వాద‌న కూడా ఉంది. అంతే కాకుండా ఫేస్ బుక్ యూజ‌ర్ల‌లో పెరుగుద‌ల న‌మోదు కాక‌పోవ‌టం కూడా కంపెనీకి పెద్ద మైన‌స్ గా మారింది.

Next Story
Share it