Telugu Gateway
Top Stories

సీఎం పదవికి రాజీనామా చేయను

సీఎం పదవికి రాజీనామా చేయను
X

పశ్చిమబెంగాల్ లో బిగ్ ట్విస్ట్. అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని చవిచూసిన మమతా బెనర్జీ ఎవరూ ఊహించని ప్రకటన చేశారు. గత పదిహేను సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా పని చేసిన ఆమె ఎన్నికల ఫలితాల తర్వాత సీఎం పదవికి రాజీనామా చేయను అని ప్రకటించటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఎందుకంటే ఎన్నికల్లో తామే నైతికంగా విజయం సాధించాం అని...లోక్ భవన్ కు వెళ్ళేది లేదు..సీఎం పోస్ట్ కు రాజీనామా చేసేది లేదు అని ప్రకటించటం ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు పశ్చిమ బెంగాల్ లో రాజ్యాంగ సంక్షోభం తలెత్తినట్లు చెప్పవచ్చు అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సహజంగా ఏ పార్టీ అయినా బలనిరూపణ చేసుకోవాల్సింది అసెంబ్లీ సాక్షిగానే. కానీ మమతా బెనర్జీకి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దీంతో ఆమె కచ్చితంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. కానీ అధికారికంగా ఆమె రాజీనామాకు నో చెపుతుండంతో గవర్నర్ ఎలా వ్యవహరిస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చిన మమతా బెనర్జీ కేంద్ర ఎన్నికల సంఘంపై ధ్వజమెత్తారు.

పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ కుట్రలతోనే గెలిచిందని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. బీజేపీకి ఈసీ ఏజెంట్‌గా మారిందని విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికలో ప్రధాన విలన్ ఎన్నికల సంఘమే అన్నారు. తాను ఎన్నికల్లో ఓడిపోలేదని చెప్పారు. అందువల్ల తాను రాజీనామా చేసే ప్రసక్తి కూడా లేదన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి మీడియా సమావేశంలో మమతాబెనర్జీ మాట్లాడారు.ఈ ఎన్నికల్లో విలన్‌గా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహరించారు. బెంగాల్‌లో ఈవీఎంలను లూటీ చేశారు' అని మమత ఆరోపించారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు పోలింగ్ ముగిసిన తర్వాత కూడా 80 నుంచి 90 శాతం కంటే ఎక్కువ బ్యాటరీని కలిగి ఉండటం ఏమిటి? అని ప్రశ్నించారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందే అధికారులు తమ పార్టీపై దాడులు, కార్యకర్తల అరెస్టులు చేశారని అన్నారు.

భవానీపూర్ లో ఉద్దేశపూర్వకంగానే ఒక ప్లాన్ ప్రకారం తనను ఓడించారని, ఎన్నికల కమిషన్‌‌ను దుర్వినియోగపరిచి బీజేపీ విజయం సాధించిందని, తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నికలు చూడలేదని అన్నారు. కౌంటింగ్ సెంటర్లలో టీఎంసీ కార్యకర్తలను కొట్టారని, తనపై కూడా దాడి చేశారని ఆరోపించారు. ఎస్ఐఆర్ నుంచి 90 లక్షల ఓట్లను తొలగించారనీ, కోర్టుకు వెళ్లడంతో 32 లక్షల ఓట్లు చేర్చారని, టీఎంసీని ఓడించేందుకు అన్నిరకాలుగా ఎత్తుగడలు పన్ని 100 సీట్ల వరకూ బీజేపీ లూటీ చేసిందని విమర్శించారు.ఈ మొత్తం ఉదంతంలో 'ఇండి' కూటమి తన వైపే ఉందని తెలిపారు. ఎన్నికల ఫలితాల అనంతరం సోనియాగాంధీ, రాహుల్ గాంధీ తనతో మాట్లాడారని, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్, హేమంత్ సోరెన్ తదితరులు ఫోను చేసి సపోర్ట్‌గా నిలిచారని చెప్పారు. ఇండియా కూటమిలోనే తాను కొనసాగుతానని కూడా స్పష్టం చేశారు.

Next Story
Share it