Telugu Gateway
Top Stories

దుబాయ్ మరో రికార్డు బ్రేక్!

దుబాయ్ మరో రికార్డు బ్రేక్!
X

దుబాయ్ లో టూరిస్ట్ అట్రాక్షన్స్ లెక్కలేనన్ని ఉంటాయి. ప్రతి రెండు సంవత్సరాలకు అక్కడ ఒక కొత్త ఆకర్షణీయ ప్రాజెక్ట్ వస్తూనే ఉంటుంది. దుబాయ్ పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది ప్రపంచంలోనే ఎత్తైన బుర్జ్ ఖలీఫా బిల్డింగ్ అన్న విషయం తెలిసిందే. దీని ఎత్తు 828 మీటర్లు. ఇప్పటికే ప్రపంచంలోనే ఎత్తైన భవనం రికార్డు ను సొంతం చేసుకున్న దుబాయ్ ఇప్పుడు అలాంటిదే మరో రికార్డు నమోదు చేసుకోవటానికి సిద్ధం అయింది. ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ కూడా ఇప్పుడు దుబాయ్ లోనే కొలువుతీరింది. అదే సియల్ దుబాయ్ మెరీనా. దుబాయ్ కి మరో ఆకర్షణగా మారనున్న ఈ హోటల్ నవంబర్ 15 నుంచి అందుబాటులోకి రానుంది. 82 అంతస్థులతో ఉండే ఈ హోటల్ లో ఏకంగా 1004 రూమ్ లు ఉంటాయి. ఈ హోటల్ 377 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇంటర్ కాంటినెంటల్ గ్రూప్ విగ్నేట్టే కలెక్షన్ కింద ఈ హోటల్ ను నిర్మించారు.

ఇప్పటి వరకు దుబాయిలో షేక్ జాయేద్ రోడ్ లో ఉన్న గెవారా హోటల్ ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ అనే హోదా ను కోల్పోనుంది. ఈ హోటల్ ఎత్తు 356 మీటర్లు అయితే..ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి రానున్న హోటల్ సియల్ దుబాయ్ మెరీనా ఎత్తు 377 మీటర్లు. గతంలో కూడా ప్రపంచంలోనే ఎత్తైన హోటల్ దుబాయిలోనే ఉన్నా కూడా దుబాయ్ రికార్డు ను మరో సారి దుబాయే బ్రేక్ చేస్తుండటం విశేషం. ఈ హోటల్ లో ఎన్నో ప్రత్యేకతలు పర్యాటకులను ఆకట్టుకోనున్నాయి. స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి దుబాయ్ అందాలను ఈ హోటల్ నుంచే వీక్షించేలా దీన్ని డిజైన్ చేశారు.

అయితే ఇది సామాన్య...మధ్య తరగతి పర్యాటకులకు అందుబాటులో ఉండే హోటల్ కాదు అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో డీలక్స్ రూమ్ అద్దె ఒక్క రోజుకు నలభై ఆరు వేల రూపాయలు పైనే ఉంటుంది. సూట్ రూమ్ ఒక్క రోజు ఛార్జ్ లక్ష రూపాయలు పైనే. పర్యాటకులు ఇందులో ఉండటం సాధ్యం కాకపోయినా ఈ హోటల్ లోని 81 వ అంతస్తులో ఏర్పాటు చేస్తున్న పనోరమిక్ ఆబ్సర్వషన్ డెక్ నుంచి దుబాయ్ అందాలు వీక్షించే అవకాశం ఉంటుంది. అయితే దీని టికెట్ ధరను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. ఈ డెక్ నుంచి దుబాయ్ అందాలను 360 డిగ్రీ వ్యూ తో చూడొచ్చు.

Next Story
Share it