కలకలం రేపిన ప్రమాదం

భారీ వర్షం లేదు. అననుకూల వాతావరణం లేదు. క్లియర్ స్కై. కానీ టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. ఈ విషాద ఘటనకు కారణం ఏమై ఉంటుంది అన్న విషయంపై ఇప్పుడు అధికార వర్గాలు దృష్టి సారించాయి. గురువారం మధ్యాహ్నం అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా కు చెందిన ఏఐ -171 విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే కూలిపోయింది. ఆ సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారు. టేక్ ఆఫ్ అయిన వెంటనే విమానం కూలిపోవడంతో విమానాశ్రయం పక్కనే ఉన్న ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున ఆస్థి, ప్రాణ నష్టం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వైడ్ బాడీ బోయింగ్ 787 డ్రీం లైనర్ విమానంలో ఒకే సారి మూడు వందల మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. కూలిపోయిన ఈ ఫ్లైట్ గత పదకొండు సంవత్సరాలుగా సేవలు అందిస్తోంది.
అహ్మదాబాద్ నుంచి లండన్ లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ కావటంతో ఇందులో ఇంధనం కూడా చాలా ఎక్కువగా ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి. టేక్ ఆఫ్ అయిన కొద్ది సేపటికే పైలట్స్ నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటిసి)కి మే డే కాల్ వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మే డే కాల్ అంటే తాము తీవ్ర ప్రమాదంలో ఉన్నామనే విషయాన్ని తెలియచేయటం. ఏటిసి సిబ్బంది తర్వాత పైలట్స్ తో మాట్లాడే ప్రయత్నం చేసే లోగానే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ ఘోర ప్రమాదానికి గురి కావటంతో మరో సారి ఇప్పుడు బోయింగ్ విమానాలపై చర్చ తెరమీదకు వచ్చింది. గతంలో కూడా ఈ విమానాల్లో పెద్ద ఎత్తున సాంకేతిక సమస్యలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇంత భారీ ప్రమాదం చోటు చేసుకోవటం మాత్రం ఇదే మొదటి సారి. ఈ 787 డ్రీమ్ లైనర్ విమానం ఒకే సారి నాన్ స్టాప్ గా 13530 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. లాంగ్ డిస్టెన్స్ రూట్స్ లోనే వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
బోయింగ్ కు చెందిన 777 , 787 విమానాల్లో ఎన్నో సాంకేతిక సమస్యలు ఉన్నాయని గతంలో ఒక విజిల్ బ్లోయర్ సంచలన ఆరోపణలు చేశారు. వీటి వల్ల దీర్ఘకాలం లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను బోయింగ్ కొట్టిపారేసింది. తమ విమానాలు అన్నీ నిబంధనల ప్రకారం..అన్ని సురక్షిత చర్యలతోనే తయారు చేస్తున్నట్లు వెల్లడించింది. అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదంలో కూలిపోయిన ఫ్లైట్ బ్లాక్ బాక్స్ ను విశ్లేషించిన తర్వాత కానీ ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడి అయ్యే అవకాశాలు లేవు అని అధికారులు చెపుతున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్ ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న వెంటనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు వెంటనే బయలుదేరి అహ్మదాబాద్ వెళ్లారు.



