ఎల్ ఐసీ ఐపీవో విజయవంతం
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐసీ) పబ్లిక్ ఇష్యూ విజయవంతం అయింది. ఇష్యూ ప్రారంభం అయిన రెండవ రోజే అన్ని విభాగాల్లో ఇష్యూ సబ్ స్క్రైబ్ అయింది. దేశంలో ఇప్పటి వరకూ వచ్చిన ఐపీవోల్లో ఇదే అతి పెద్దది కావటం విశేషం. ఐపీవో ద్వా రా ఎల్ ఐసీ తొలి విడతలో 20557 కోట్ల రూపాయలు సమీకరించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకూ పేటీఎం ఐపీవో 18 వేల కోట్ల రూపాయలు భారత్ లోనే అతి పెద్ద ఐపీవోగా ఉండేది. ఎల్ ఐసీ దీన్ని అధిగమించింది. ఎల్ ఐసీ యాజమాన్యం షేర్ల ధరను 902-949 రూపాయలుగా నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎల్ ఐసీ మొత్తం 16.2 కోట్ల షేర్లను ఆఫర్ చేయగా..ఇప్పటికే 16.24 కోట్ల షేర్లకు బిడ్స్ వచ్చాయి. మే4న ప్రారంభం అయిన ఈ ఐపీవో మే9న ముగియనుంది. అంటే ముగింపు తేదీ నాటికి మరిన్ని బిడ్స్ రావటం ఖాయం. ఎల్ ఐసీలో పాలసీలు ఉన్నవారికి ప్రత్యేకంగా షేర్లను కేటాయించారు.
ఈ విభాగం కూడా 3.02 శాతం రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. ఉద్యోగుల పోర్షన్ 2.14 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. అయితే ఎల్ ఐసీ ఐపీవో విజయవంతంపై ఎవరికీ పెద్దగా అనుమానాలు లేవు. కాకపోతే ప్రభుత్వం ఎల్ ఐసీ విలువను తక్కువ చేసి చూపించిందని..పరిశ్రమ ప్రమాణాల ప్రకారం ఎల్ ఐసీ విలువను లెక్కించకుండా కారుచౌకగా కంపెనీ షేర్లను విక్రయించటంపై పలువురు నిఫుణులు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కూడా తాజాగా ఈ అంశంపై స్పందించారు. ఎందుకు ఇంత ఆగమేఘాల మీద ఎల్ ఐసీ విలువను తగ్గించి ఐపీవో జారీ చేయాల్సిన అవసరం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. అయితే ఈ విమర్శలకు మోడీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం లేదు.