Telugu Gateway
Top Stories

ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు ఏడాదిలో 2.4 లక్షల కోట్ల నష్టం

ఎల్ఐసీ ఇన్వెస్టర్లకు ఏడాదిలో 2.4 లక్షల కోట్ల నష్టం
X

జీవిత భీమా సంస్థ (ఎల్ఐసి) ఇన్వెస్టర్ల ఆశలను దారుణంగా వమ్ము చేసింది. చాలా మంది ఈ ఐపీఓపై భారీ ఆశలే పెట్టుకున్నారు. కానీ ఎల్ఐసి మాత్రం ఇన్వెస్టర్ల ఆశలను ఏ మాత్రం నిలుపుకోలేక పోయింది. అంతే కాదు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకూ మదుపరులు ఏకంగా 2.4 లక్షల కోట్ల రూపాయల మేర నష్టపోయారు. లిస్ట్ అయిన సమయంలో ఎల్ఐసి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు లక్షల కోట్ల రూపాయలు ఉండగా ఇప్పడు అది 2.4 లక్షల కోట్ల నష్టంతో 3 .6 లక్షల కోట్ల రూపాయలకు పరిమితం అయింది. ఎల్ఐసి షేర్లు కూడా ఆఫర్ ధరతో పోలిస్తే సుమారు నలభై శాతం డిస్కౌంట్ తో ట్రేడ్ అవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు మెగా ఐపీఓ..మెగా లాస్ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఎల్ఐసీ 949 రూపాయల ధరతో ఇన్వెస్టర్లకు షేర్లు కేటాయించిన విషయం తెలిసిందే. బుధవారం నాడు ఈ షేర్ బిఎస్ఈ లో కేవలం 2 .70 రూపాయల లాభంతో 570 రూపాయల వద్ద ముగిసింది.

ఇప్పటివరకు ఒక్క సారి కూడా ఎల్ఐసి షేర్లు ఆఫర్ ధరకు చేరుకోలేదు. ఇక్కడ మరో విషయం ఏమిటి అంటే ఇదే ఏడాది కాలంలో సెన్సెక్స్ 14 శాతం లాభాలు సాధిస్తే..ఎల్ఐసి మాత్రం అందుకు బిన్నంగా ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తోంది. ఎల్ఐసి షేర్ల నుంచి గత ఏడాది కాలంలో మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఐఐ లు తమ వాటాలను తగ్గించుకుంటూ పోయారు. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం తమ వాటాను పెంచుకున్నారు. దేశంలో అతి పెద్ద ఐపీఓ ఎల్ఐసి దే.. ఈ సంస్థ మార్కెట్ నుంచి ఏకంగా 21000 కోట్ల రూపాయలు సమీకరించింది. అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్ కు సంబంధించి విడుదల చేసిన నివేదిక కూడా ఎల్ఐసి షేర్ల పై తీవ్ర ప్రభావం చూపించింది. అది ఇంకా కొనసాగుతూనే ఉంది.

Next Story
Share it