చరిత్ర సృష్టించిన లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ఐపీవో

లేటెంట్ వ్యూ అనలిటిక్స్ ఐపీవో స్టాక్ మార్కెట్లో కొత్త చరిత్ర లిఖించింది. ఇప్పటివరకూ అత్యధిక రెట్లు సబ్ స్క్రైబ్ అయిన పబ్లిక్ ఇష్యూగా ఇది నిలిచింది. 600 కోట్ల రూపాయలు మార్కెట్ నుంచి సమీకరించేందుకు ఈ కంపెనీ ఐపీవోతో ముందుకు రాగా ఇది 326.49 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. గతంలో పరాస్ డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీల రికార్డులను ఈ కంపెనీ తిరగరాసింది. ఈ శుక్రవారం నాడు ఈ ఇష్యూ మొత్తం 326.49 రెట్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. ఇష్యూ ముగింపునకు చివరి రోజు కూడా ఇదే. ఈ కంపెనీ ఇన్వెస్టర్లకు 1.75 కోట్ల షేర్లను మాత్రం ఆఫర్ చేయగా..572 కోట్ల ఈక్విటీ షేర్లకు బిడ్స్ వచ్చాయి. అదే సమయంలో సంస్థేతర పెట్టుబడిదారుల కోసం కేటాయించిన పోర్షన్ 850.66 సార్లు ఓవర్ సబ్ స్క్రైబ్ అయింది. లేటెంట్ వ్యూ 190-197 రూపాయల మధ్య షేర్లను ఆఫర్ చేసింది.
ఈ డేటా అనలిటిక్స్ కంపెనీపై మదుపర్లు పెద్ద ఎత్తున ఆసక్తికనపర్చారు. భారతీయ మార్కెట్లో ఇప్పుడు ఐపీవో అంటే చాలు ఇన్వెస్టర్లు ఏ మాత్రం ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టేస్తున్నారు.ఇటీవలే భారత్ లో అతి పెద్ద ఐపీవో అయిన పేటీఎం కూడా విజయవంతం అయిన విషయం తెలిసిందే. పేటీఎం ఏకంగా 18 వేల కోట్ల రూపాయలను ఐపీవో ద్వారా సమీకరించింది. ఇప్పటివరకూ దేశంలో ఇదే అతి పెద్ద ఐపీవో. అంతకు ముందు ఈ రికార్డు కోల్ ఇండియా పేరుతో ఉండేది. ప్రస్తుత మార్కెట్ ఐపీవోలకు అనుకూలంగా ఉండటంతో కంపెనీలు అన్నీ మార్కెట్ నుంచి నిధుల సమీకరణకు క్యూకడుతున్నాయి.



