హైదరాబాద్..రాయపూర్ ల్లో ప్రాజెక్టులు
ప్లాస్టిక్ వ్యర్ధాలు ఇప్పుడు దేశంలోనే కాదు...ప్రపంచ వ్యాప్తంగా కూడా పెద్ద సమస్యగా మారిన విషయం తెలిసిందే. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పలు సంస్థలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కనుగొనే దిశలో రీ సస్టైనబిలిటీ, హార్ష్ మారివాలా కు చెందిన సంస్థ షార్ప్ వెంచర్స్ చేతులు కలిపాయి. మంగళవారం నాడు హైదరాబాద్ లో ఈ రెండు సంస్థలు ఒప్పంద పత్రాలు మార్చుకున్నాయి. ప్లాసిక్ వ్యర్ధాల రీసైక్లింగ్ విషయంలో కూడా మానవ ప్రమేయాన్ని పరిమితం చేసి...ఇందులో కూడా రోబోటిక్స్ తో పాటు కృత్రిమ మేధస్సు (ఏఐ)ని ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలను మారికో చైర్మన్ మారివాలా, రీ సస్టైనబిలిటీ ఎండీ మసూద్ లు మీడియాకి వివరించారు. స్థానికులను భాగస్వాములు చేయటం ద్వారా తొలి దశలో తాము తెలంగాణాలో హైదరాబాద్ లో, ఛత్తీస్ గడ్ లోని రాయపూర్ లో ప్రోటో టైపు ప్రాజెక్ట్ లను అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఈ ప్రాజెక్ట్ ల ద్వారా ఏడాది కాలంలో 32 వేల టన్నుల వ్యర్ధాలను రీసైకిల్ చేసి పదిహేను వేల టన్నుల కార్బన్ డయాక్సైడ్ (సిఓ 2 ) ను తగ్గిస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతం అయితే దేశ వ్యాప్తంగా వీటిని విస్తరిస్తామన్నారు. ఒక వైపు ప్లాస్టిక్ వ్యర్ధాలను తగ్గించటం తో పాటు ఎఫ్ఎంసీజీ పరిశ్రమకు అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ పాలీఓలిఫిన్స్ (polyolefins) సరఫరాను పెంచడం, పర్యావరణం, సామాజిక విభాగాలపై సుస్థిరమైన ప్రభావాన్ని సాధించడమనేవి తమ ప్రాజెక్ట్ లక్ష్యంలో భాగంగా ఉన్నాయని వివరించారు. ప్రస్తుతం భారతదేశంలోని ఎఫ్ఎంసీజీ రంగం అత్యంత నాణ్యమైన రీసైకిల్డ్ మెటీరియల్స్‌ను పొందటంలో పెద్దఎత్తున సవాళ్లను ఎదుర్కొంటోంది అని తెలిపారు. సస్టెయినబిలిటీ లక్ష్యాలను సాధించడంలో, వర్జిన్ ప్లాస్టిక్స్‌పై ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి సంబంధించి వాటి సామర్థ్యాలు పరిమితంగా ఉంటున్నాయి.
32,000 టన్నుల వ్యర్ధాలను క్యాప్చర్ చేయడం, ప్రాసెస్ చేయడం ద్వారా వార్షికంగా 15,000 టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించడం తో పాటు ఏటా 9,000 టన్నుల పైగా అత్యుత్తమ రీసైకిల్డ్ పాలీమర్స్‌ను ఉత్పత్తి చేయాలని, వివిధ ఎఫ్ఎంసీజీ , ఇతరత్రా అవసరాలకు ఆ మెటీరియల్‌ను సరఫరా చేయాలని ఈ ప్రాజెక్టు నిర్దేశించుకుంది. వచ్చే ఐదేళ్లలో ఈ కార్యక్రమం పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను తగ్గిస్తూ, బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్వహణ విధానాలకు కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో రీసైకిల్డ్ పాలీమర్స్ ఎంటర్‌ప్రైజ్‌గా విస్తరించనుంది. 11 దేశాల్లో వ్యర్ధాల నిర్వహణలో 30 ఏళ్లకు పైగా అనుభవమున్న రి సస్టెయినబిలిటీ సంస్థ ఈ ఇనీషియేటివ్‌కి తన విస్తృత అనుభవం, వినూత్న విధానాల తోడ్పాటును అందిస్తుంది.