Telugu Gateway
Top Stories

కేరళ పర్యాటకానికి అదనపు హంగులు

కేరళ పర్యాటకానికి అదనపు హంగులు
X

దేశంలోనే తొలి వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కేరళలో అందుబాటులోకి రానుంది. సహజంగా మెట్రో అంటే పట్టాలపై నడుస్తుంది అనే విషయం తెలిసిందే. అలాంటిది నీళ్లపై మెట్రో కాన్సెప్ట్ తో ప్రాజెక్ట్ తీసుకురావటం దీని ప్రత్యేకత గా చెప్పుకోవాలి. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని రీతిలో ఎలక్ట్రిక్ బోట్స్ తో ఈ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ డిజైన్ చేశారు. నీళ్లపై నడిచే ఈ బోట్ లు కూడా మెట్రో తరహాలోనే ఉంటాయి. బ్యాటరీ తో పాటు నడిచే ఈ ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్స్ కొచ్చి పరిసర ప్రాంతాల్లో ఉన్న పది ద్వీపాలను కనెక్ట్ చేస్తాయి. కేరళ రాష్ట్రంలో పర్యాటకానికి ఇది మరింత జోష్ తెస్తుంది అనే అభిప్రాయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ వాటర్ మెట్రో 78 ఎలక్ట్రిక్ బోట్స్..38 టెర్మినల్స్ తో కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. కేరళ వాటర్ మెట్రో ప్రాజెక్ట్ కు ఏప్రిల్ 25 న ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.

1,136.83 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ ను కేరళ ప్రభుత్వం, జర్మనీ కి చెందిన ఫండింగ్ ఏజెన్సీ కెఎఫ్ డబ్ల్యూ సంయుక్తంగా చేపట్టాయి. ఈ ప్రాజెక్టు వల్ల కొచ్చి నగర అభివృద్ధి వేగవంతమవుతుందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. వాటర్ మెట్రో ప్రాజెక్టు తొలి దశలో హైకోర్టు-విపిన్ టెర్మినల్స్ నుంచి వైట్టిల-కక్కనడ్ టెర్మినల్స్‌ వరకు సేవలు ప్రారంభమవుతాయి. ఈ మెట్రో సేవలు సురక్షితమని, చౌక అని పినరయి విజయన్ తెలిపారు. ఎయిర్ కండిషన్డ్ బోట్లలో ప్రయాణం చేయవచ్చునని చెప్పారు. ప్రయాణికులు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకోవలసిన అవసరం లేకుండా ప్రయాణం చేయవచ్చునన్నారు.మరో వైపు దేశం లో తొలిసారి అండర్ వాటర్ మెట్రో కూడా కోల్కతా నగరంలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే దీనికి సంబదించిన పనులు పూర్తి అయ్యాయి. దేశంలో ఫస్ట్ మెట్రో ప్రారంభం అయింది కోల్కతా లోనే..ఇప్పుడు అండర్ వాటర్ మెట్రో కూడా ఫస్ట్ అక్కడే ప్రారంభం కానుంది.

Next Story
Share it