తనిఖీల్లో కళ్లు తిరిగే నోట్ల కట్టలు

ఉత్తరప్రదేశ్ లో రాజకీయ వేడితోపాటు ఐటి దాడుల వేడి కూడా పెరుగుతోంది. ఎన్నికల వేళ ఐటి వరస పెట్టి దాడులు చేస్తోంది. పన్ను ఎగవేత ఆరోపణలపై ఈ దాడులు సాగుతున్నాయి. అయితే తాజాగా జరిగిన దాడిలో మాత్రం కళ్లు తిరిగే నోట్ల కట్టలు బహిర్గతం అయ్యాయి. ఇవి చూసి అధికారులు కూడా అవాక్కు అయ్యారు. అంతే కాదు..వీటిని లెక్కించటానికే వాళ్లకు చాలా సమయం పట్టింది. అది కూడా మెషిన్లతో లెక్కిస్తేనే సుమా. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో జరిగిన ఈ సోదాల్లో ఇప్పటివరకూ 150 కోట్ల రూపాయల నగదు దొరికింది. ఇంకా అధికారులు లెక్కిస్తూనే ఉన్నారు. పీయూష్ జైన్ అనే పెర్మ్యూమ్స్ తయారీ కంపెనీ యాజమానిపై దాడులు చేసిన సమయంలో ఈ నగదు బయటపడింది. ఆయన సమాజ్ వాది పార్టీ నేత కూడా. కొద్ది రోజుల క్రితం ఆయన సమాజ్ వాది పార్టీ పేరుతో ఓ పెర్మ్యూమ్ ను కూడా తయారు చేసి విడుదల చేశారు.
దీనిపై రాజకీయంగా పెద్ద దుమారమే రేగింది. ఇదే అదనుగా బిజెపి సమాజ్ వాది పార్టీపై ఎటాక్ ప్రారంభించింది. ఎస్పీ అవినీతి వాసన ఇదుగో అంటూ అధికారులు డబ్బు లెక్కిస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పన్ను ఎగవేత ఆరోపణలపై తనిఖీలకు వెళ్ళిన అధికారులకు అనుమానాస్పద అల్మారాలు కన్పించగా వాటిని తెరిపించారు. తెరిచి చూస్తే వాటి నిండా నగదు కట్టలే కన్పించాయి. నకిలీ ఇన్ వాయిస్ లు, షెల్ కంపెనీల లావాదేవీలు జరిగినట్లు చూపించి నగదు దాచినట్లు అధికారులు గుర్తించారు. ఐటితోపాటు జీఎస్ టీ అధికారులు కూడా రంగ ప్రవేశం చేసి విచారణ ప్రారంభించారు. పీయూష్ ఇంటితోపాటు మహారాష్ట్ర, గుజరాత్ ల్లో కూడా తనిఖీలు చేపట్టారు.



