Telugu Gateway
Top Stories

కంగ‌నా చెప్పింది..నిజ‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చింది 2014లోనే

కంగ‌నా చెప్పింది..నిజ‌మైన స్వాతంత్ర్యం వ‌చ్చింది 2014లోనే
X

కాంగ్రెస్ హ‌యాం బ్రిటీష్ పాల‌న‌కు కొన‌సాగింపే

కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై దుమారం..ప‌ద్మ‌శ్రీ వెన‌క్కి తీసుకోవాల‌నే డిమాండ్లు

కంగ‌నా ర‌నౌత్. ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ అవార్డు కూడా పొందింది. దేశ స్వాతంత్ర్యానికి సంబంధించి తాజాగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. మ‌న‌కు అస‌లైన స్వాతంత్ర్యం 2014లోనే వ‌చ్చింది. అంత‌కు ముందు అంటే 1947లో మ‌న‌కు ల‌భించింది బిక్షం అంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ హ‌యాం బ్రిటీష్ పాల‌న‌కు కొన‌సాగింపే అంటూ వ్యాఖ్యానించారు. ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఓ జాతీయ ఛాన‌ల్ నిర్వ‌హించిన కార్య‌క్రమంలో పాల్గొన్న కంగ‌నా ఈ వ్యాఖ్య‌లు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ కంగ‌నా ర‌నౌత్ పై మండిప‌డ్డారు బిజెపి ఎంపీ వ‌రుణ్ గాంధీ. కంగ‌నా వ్యాఖ్య‌లపై స్పందిస్తూ ఆమె ఆలోచ‌న‌ను పిచ్చిత‌నంగా భావించాలా లేక దేశద్రోహంగా ప‌రిగ‌ణించాలా అని ప్ర‌శ్నించారు.

కొన్ని సార్లు మ‌హాత్మాగాంధీ త్యాగాలు, ఆయ‌న చేసిన దీక్షల‌ను అవ‌మానిస్తారు. మ‌రికొన్నిసార్లు ఆయ‌న్ను హ‌త్య చేసిన‌వారిని పొగుడుతారు. ఇప్పుడు మంగ‌ళ్ పాండే నుంచి మొద‌లుకుని సుభాష్ చంద్ర‌బోస్, భ‌గ‌త్ సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్, రాణీ ల‌క్ష్మీభాయి వంటి ఎంతో మంది స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల త్యాగాల‌ను అవ‌మానిస్తున్నారు అంటూ మండిప‌డ్డారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై ప‌లు పార్టీలు ఫైర్ అవుతున్నాయి. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నేష‌న‌ల్ నేష‌న‌ల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మ‌న్ ప్రీతి మీన‌న్ ముంబ‌య్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కంగ‌నా వ్యాఖ్య‌ల‌పై కొంత మంది నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. దేశ స్వాతంత్ర్య స‌మ‌ర‌యోధుల‌ను అవ‌మానించినందున ఆమెకు ఇచ్చిన ప‌ద్మ‌శ్రీ అవార్డును వెన‌క్కి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు. మ‌రికొంత మంది అయితే ఆమెపై దేశ‌ద్రోహం కేసు పెట్టాల‌న్నారు.

Next Story
Share it