వెయ్యి కోట్లతో కొత్త పార్లమెంట్ భవనం అవసరమా?
ప్రధాని నరేంద్రమోడీపై ప్రముఖ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు. దేశంలో ప్రజలంతా కరోనాతో ఉద్యోగాలు పోయి..తిండి లేక చాలా మంది అవస్థలు పడుతుంటే వెయ్యి కోట్ల రూపాయలతో ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం కట్టాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నించారు. ఆర్ధిక వ్యవస్థ కూడా కరోనాతో అతలాకుతలం అయిందన్నారు. దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు లేకుండా అల్లాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రారంభించనున్న కమల్ ఈ మేరకు మోదీపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు.
గ్రేట్‌వాల్ ఆఫ్ చైనా నిర్మించే క్రమలో వేలాదిమంది అమాయకులు ప్రాణాలు విడిస్తే.. ప్రజల్ని రక్షించేందుకు ఆ భారీ నిర్మాణం చేపట్టామని పాలకులు సెలవిచ్చారట. మీ ధోరణి కూడా అలాగే ఉంది. ఎవరిని రక్షించేందుకు మీరు వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. దయచేసి నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి ప్రధాన మంత్రి మోదీ గారు'అని కమల్ ప్రశ్నించారు. డిసెంబర్ 10న ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు ప్రధాని శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్ గెలుచుకుంది. 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.