Telugu Gateway
Top Stories

రాజకీయాలపై ఎన్టీఆర్..ఇది సమయం కాదు

రాజకీయాలపై ఎన్టీఆర్..ఇది సమయం కాదు
X

రాజకీయాలకు సంబంధించిన అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. త్వరలోనే ఆయన జెమినీ టీవీలో ప్రసారం కానున్న 'ఎవరు మీలో కోటీశ్వరులు ' కార్యక్రమ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన అంశాలను వివరించేందుకు ఆయన శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఓ ప్రశ్న వేస్తూ మీ అభిమానులు ' రావాలి ఎన్టీఆర్..కావాలి ఎన్టీఆర్' అంటే ఏమి చెబుతారని ప్రశ్నించారు. ఎన్నోసార్లు తన మాటలు విన్న మీరే..ఏమి చెప్పాలో చెప్పండి అంటూ ఎదురుప్రశ్నవేశారు. తర్వాత దీనిపై ఆయనే స్పందిస్తూ ఈ అంశంపై మాట్లాడటానికి ఇది ఏ మాత్రం సమయం కాదూ...సందర్భం కాదు అంటూ తేల్చేశారు. తర్వాత ఎప్పుడైనా మంచిగా కాపీ తాగుతూ ఈ అంశంపై చర్చించుకుందామంటూ రాజకీయాల అంశాన్ని కట్ చేశారు. గతంలో చిరంజీవి, నాగార్జునలు హోస్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయటం ఛాలెంజింగ్ టాస్కే అని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రొమోను కూడా జెమిని టీవీ విడుదల చేసింది. 'కల మీది కథ మీది. ఆట నాది..కోటి మీది' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగులతో ఇది కట్ చేశారు.

మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స్పందిస్తూ సోషల్ మీడియాలో తాను పెద్దగా యాక్టివ్ గా ఉండనన్నారు. కాకపోతే అక్కడ జరిగే విషయాలు..మెజారిటీ ప్రజల అభిప్రాయాలు తాను తెలుసుకుంటానన్నారు. ఆర్ఆర్ఆర్ వంటి ప్రతిష్టాత్మక సినిమాలో భాగం కావటం వల్ల తనకు అంత సమయం కూడా లేదన్నారు. ఈ షో ద్వారా జూనియర్ ఎన్టీఆర్ నుంచి రామారావుగా ప్రమోట్ అయ్యారా అన్న ప్రశ్నకు ఎన్టీఆర్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ' మా అమ్మ నాకు ఓ పేరు పెట్టింది. మా అవిడ తనో పేరుతో పిలుస్తుంది. మా పిల్లలు నాన్న అంటారు. జూనియర్ అన్నా పలుకుతాను. ప్రేమతో ఎలా పిలిచినా పలుకుతాను. నన్ను ఇలాగే పిలవండి' అని నేను చెప్పను అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it