Telugu Gateway
Top Stories

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పై 38 వేల కేసులు

జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పై 38 వేల కేసులు
X

ఈ కంపెనీ బేబీ పౌడ‌ర్ ఎంత పాపుల‌రో అంద‌రికి తెలిసిందే. అయితే ఈ పౌడ‌ర్ పై ఎప్ప‌టి నుంచో దుమారం రేగుతోంది. ఈ పౌడ‌ర్ వ‌ల్ల చాలా మంది పిల్ల‌లు క్యాన్స‌ర్ బారిన ప‌డ్డార‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. కంపెనీ ఈ ఆరోప‌ణ‌లు తోసిపుచ్చుతున్నా దీనిపై కేసుల న‌మోదు ఆగ‌టం లేదు. ఇప్ప‌టికే ఏకంగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ పై 38 వేల కేసులు న‌మోదు అయ్యాయి. వీరంతా న‌ష్ట‌ప‌రిహారం కోరుతూ కోర్టుల‌ను ఆశ్ర‌యించారు. అమెరికాలో ఈ కంపెనీ 2020 నుంచే ఈ పౌడ‌ర్ అమ్మ‌కాల‌ను కంపెనీ నిలిపివేసింది. వచ్చే ఏడాది నుంచి ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ బేబీ టాల్క‌మ్ పౌడ‌ర్ అమ్మ‌కాల‌ను నిలిపివేయ‌నున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది. దీనికి కార‌ణం పెరుగుతున్న కేసులు..అమ్మ‌కాలు త‌గ్గ‌టం కూడా ఒక‌టి.

అయితే ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకుని..నియంత్ర‌ణా సంస్థ‌ల అనుమ‌తులు పొందిన త‌ర్వాతే మార్కెట్లోకి పౌడ‌ర్ ను తెచ్చామ‌ని కంపెనీ వాదిస్తోంది. న్యాయ‌వాదాల్లో కంపెనీ త‌న వాద‌న‌లు విన్పించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే మాత్రం వినియోగ‌దారుల‌కు బాధితుల‌కు భారీ ఎత్తున న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. జాన్స‌న్ అండ్ జాన్స‌న్ త‌న ఉత్ప‌త్తుల‌ను ఉప‌సంహ‌రించుబోతున్న‌ట్లు చేసిన ప్ర‌క‌ట‌న‌ను కూడా వినియోగ‌దారులు త‌మ వాద‌న‌కు బ‌లం చేకూర్చేందుకు వాడుకునే అవ‌కాశం ఉందని భావిస్తున్నారు. ఇప్ప‌టికే పలు కోర్టులు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించాల్సిందిగా జాన్స‌న్ అండ్ జాన్స‌న్ ను ఆదేశించాయి. ఇప్ప‌టికే కంపెనీ 2.2 బిలియ‌న్ డాల‌ర్లు చెల్లించిన‌ట్లు స‌మాచారం.

Next Story
Share it