జో బైడెన్...మానవ రూపంలో ఉన్న తోలుబొమ్మ
ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
#అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పై టెస్లా సీఈవో ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జో బైడెన్ ..మానవ రూపంలో ఉన్న తోలు బొమ్మ అంటూ ట్వీట్ చేశారు. జో బైడెన్ విధానాలను మస్క్ తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అమెరికన్లను బైడెన్ తెలివి తక్కువ వారిగా చూస్తున్నారంటూ మండిపడ్డారు. తాజాగా జో బైడెన్ ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో టెస్లా గురించి అసలు మాట మాత్రంగా కూడా ఆయన ప్రస్తావించలేదు. టెస్లా కార్లు ఎంతో పాపులర్ కావటంతోపాటు మంచి మార్కెట్ వాటాను కలిగి ఉన్నాయి. జనరల్ మోటార్స్ (జీఎం), ఫోర్డ్ వంటి సంస్థలు గతంలో ఎన్నడూలేని రీతిలో స్థానికంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయంటూ బైడెన్ ప్రశంసించారు.
ఆ సమయంలో ఆయన అసలు టెస్లా గురించి ప్రస్తావించలేదు. ఈ కార్లకు సంబంధించిన సమావేశానికి కూడా టెస్లా సీఈవో ఎలన్ మస్క్ ను ఆహ్వానించలేదు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మస్క్ మాటల యుద్ధానికి దిగారు. 2030 నాటికి అమెరికాలో అన్ని వాహనాలు ఎలక్ట్రిక్ కార్లే ఉండాలంటూ ఆయన గత ఏడాది ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అప్పుడు కూడా బైడెన్ అసలు టెస్లా సీఈవోను పట్టించుకోలేదు..పైగా సమావేశానికి ఆహ్వానించలేదు కూడా. ఇప్పుడు కూడా అదే రిపీట్ కావటంతో ఎలన్ మస్క్ విమర్శలు గుప్పించారు. తాజాగా ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.