Telugu Gateway
Top Stories

జో బైడెన్ కు 306..ట్రంప్ 232 ఓట్లు

జో బైడెన్ కు 306..ట్రంప్ 232 ఓట్లు
X

అయిపోయింది. కథ అంతా ముగిసిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంత మారాం చేసినా ఫలితాల్లో మార్పేమి ఉండదు కదా?. అంతే కాదు ఫైనల్ ఫలితాలు కూడా వచ్చేశాయి. దీంతో జో బైడెన్ ఓట్లు ఏకంగా 306కు చేరగా, డొనాల్డ్ ట్రంప్ 232 ఓట్ల వద్దే ఆగిపోయారు. దీంతో ఓటమిని అంగీరించక తప్పని పరిస్థితి. మరి ట్రంప్ ఏమి చేస్తారో వేచిచూడాల్సిందే. అమెరికా చరిత్రలో ఎవరూ చేయనిరీతిలో ట్రంప్ ఎన్నికల అనంతరం కూడా నానా రచ్చ చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇది అమెరికాను చులకన చేస్తోంది. అయినా సరే ఇప్పటివరకూ ట్రంప్ నేరుగా ఇంత వరకూ తన ఓటమిని అంగీకరించటానికి రెడీ అవటం లేదు. అయితే తాజాగా కోర్టుకు వెళ్లే అంశంపై ట్రంప్ పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ట్రంప్‌ ఆరోపణలు గుప్పించిన సంగతి తెలిసిందే. కోర్టులు ఆధారాలు అడిగితే చేతులెత్తేశారు కూడా. అటార్నీ జనరల్‌ విలియం బార్‌ ఓటింగ్‌ అక్రమాలపై విచారణకు న్యాయశాఖకు అనుమతి ఇవ్వడం, అధికార మార్పిడికి సంబంధించి బైడెన్‌ బృందానికి సహకరించకుండా ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డుకోవడం వంటివి చేశారు.

ఓటమిని జీర్ణించుకోలేని ట్రంప్‌ ఒకవైపు పెంటగన్‌ అధ్యక్షుడిని తప్పించారు. అయితే తాజా పరిణామాల అనంతరం ట్రంప్‌ కాస్త వెనక్కి తగ్గినట్లు కన్పిస్తోంది. అయితే తన తన మద్దతుదారులను సంఘటితంగా ఉంచేందుకు ట్రంప్ ఎన్నికల తరహా స్టాఫ్‌ ది స్టీల్, మిలియన్ మెగా మార్చ్‌, విమెన్ ఫర్ అమెరికా ఫస్ట్ అనే పేర్లతో ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉంది. తాజాగా రోజ్‌ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. భవిష్యత్తులో ఏం జరిగినా అది ఎవరి పరిపాలన వల్లో అందరికీ తెలుస్తోంది..దీనికి సమయమే సమాధానం చెబుతుందని భావిస్తున్నానంటూ బైడెన్‌ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం తాను మాత్రం కరోనా కట్టడికి దేశంలో లాక్‌డౌన్‌ అమలు చేసే ప్రసక్తే లేదని ట్రంప్‌ స్పష్టం చేశారు.

Next Story
Share it