Telugu Gateway
Top Stories

ఏడాది అంతా ఇదే పరిస్థితి

ఏడాది అంతా ఇదే పరిస్థితి
X

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) రంగంలో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి ఆగుతాయో ప్రస్తుతానికి ఎవరికీ అంతుబట్టడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా అంటే 2022 -2023 సంవత్సరాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 4 .25 లక్షల మంది ఐటి తో పాటు అనుబంధ రంగాల్లో ఉద్యోగాలు కోల్పోయారు . 2024 సంవత్సరంలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఒక్క ఏప్రిల్ నెలలోనే ఐదు దిగ్గజ కంపెనీలు ఏకంగా ఇరవై వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. ఇందులో యాపిల్, గూగుల్, అమెజాన్, ఇంటెల్, టెస్లా వంటి కంపెనీలు ఉన్నాయి. దిగ్గజ కంపెనీలే కాకుండా స్టార్టప్‌ ల్లో కూడా ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నారు. ఈ ఏడాది తొలి నాలుగు నెలల కాలంలోనే 75 వేల మంది వరకు ఉద్యోగాలు కోల్పోయినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

అమెరికాలో ప్రస్తుతం జాబ్ మార్కెట్ ఏ మాత్రం ఆశాజనకంగా లేదు అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. డాలర్ డ్రీమ్స్ తో లక్షలు ఖర్చుపెట్టి అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసుకున్న వాళ్ళు పడుతున్న టెన్షన్ అంతా ఇంతా కాదు. ఐటి రంగంలో జాబ్ మార్కెట్ ఎప్పుడు తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది అనే అంశంపై కూడా ఎక్కడా స్పష్టత రాకపోవటం ఒకెత్తు అయితే...దిగ్గజ కంపెనీలు అన్ని లే ఆఫ్స్ ను కొనసాగిస్తూ పోతుండటం వాళ్ళను మరింత ఆందోళనకు గురిచేస్తున్న అంశంగా కనిపిస్తోంది. మరో వైపు కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ కూడా ఐటి జాబ్స్ పై ప్రభావం చూపించే అవకాశం ఉంది అనే వార్తలు ఇప్పటికే టెన్షన్ పెడుతున్న విషయం తెలిసిందే.

ఇప్పటికే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ఎదురు చూసే వాళ్ళ పరిస్థితి ఒకటి అయితే...ఇప్పుడు కొత్తగా బి టెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ (సిఎస్ఈ) చేరాలనుకునే వాళ్ళు కూడా తర్జన భర్జనలు పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం భవిష్యత్ లో ఈ రంగం లో ఉద్యోగాలు ఎలా ఉంటాయి అన్నదే ఎక్కువ మందిని టెన్షన్ పెడుతున్న విషయం. అమెరికా ఎన్నికల తర్వాత ...ముఖ్యంగా రెండు, మూడేళ్ళలో తిరిగి ఈ సెక్టార్ గాడిన పడుతుంది అనే ఆశాభావం కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. మరి కొంత మంది ఇతర మెరుగైన ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి సారిస్తున్నారు. రెండేళ్ల క్రితం వరకు సీఎస్ఈ పూర్తి చేసిన వాళ్లకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చాయి. అది కూడా మంచి మంచి ప్యాకేజీల తో. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది అనే చెప్పాలి. అయితే ఎక్కువ మంది ఇది తాత్కాలిక సర్దుబాటుగానే అభివర్ణిస్తున్నారు. అయితే ఈ ఏడాది అంతా ఐటి రంగంలో లే ఆఫ్స్ కొనసాగుతాయి అని ఎక్కువ మంది చెపుతున్న మాట. ఐఐటిల నుంచి బయటకు వచ్చిన వాళ్లలో కూడా చాలా మంది ప్లేస్ మెంట్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. కొంత మందికి అవకాశాలు దక్కినా కూడా గతంతో పోలిస్తే వేతన ప్యాకేజ్ చాలా చాలా తక్కువగా ఉన్నట్లు కూడా చెపుతున్నారు.

Next Story
Share it