పెట్రోల్ లీటర్ పై 25 రూపాయల తగ్గింపు
పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు దేశంలో గతంలో ఎన్నడూలేనంత పెద్ద హాట్ టాపిక్ గా మారింది. బిజెపి ప్రభుత్వం వరస పెట్టి పెట్రోల్ ధరలను పెంచుతూ పోవటమే దీనికి కారణం. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గినా కూడా దేశీయంగా పన్నుల్లో మార్పులు చేస్తూ ముడిచమురు ధరలు తగ్గిన ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా కేంద్రం భారీగా ప్రయోజనం పొందింది. కరోనా కష్టకాలంలోనూ ఏ మాత్రం కనికరం లేకుండా వ్యవహరించింది. కొద్ది రోజుల క్రితం మాత్రం భారీగా పెంచిన ధరల్లో స్వల్ప ఊరట కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు ద్విచక్ర వాహనదారులకు జార్ఖండ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. పెట్రోల్ పై ఏకంగా 25 రూపాయల ధరను తగ్గిస్తున్నట్లు తెలిపింది.
ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం నాడు ఈ సంచలన ప్రకటన చేశారు. ఈ పథకం 2022 జనవరి 26 నుంచి అమలులోకి వస్తుందని సోరెన్ చెప్పారు. జార్ఖండ్ లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 25 రూపాయల తగ్గింపు ధర కేవలం ద్విచక్ర వాహనదారులకు మాత్రమే. ప్రతి వాహనదారుడికి 10 లీటర్ల వరకు ఈ సదుపాయాన్ని వర్తింపచేయనున్నారు. అయితే ఆ సమయంలో వాహనదారు రేషన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. పెరిగిన ధరల కారణంగా వాహనాలు ఉన్నా కూడా చాలా మంది వాటిని ఉపయోగించుకోలేకపోతున్నారని హేమంత్ సోరేన్ వ్యాఖ్యానించారు.