Telugu Gateway
Top Stories

జైపూర్ చారిత్రక కట్టడాల్లో ఇక ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు ఓకే

జైపూర్ చారిత్రక కట్టడాల్లో ఇక ప్రీ వెడ్డింగ్ షూట్స్ కు ఓకే
X

సందర్శకుల సమయంలో రెండు గంటలకు ఐదు వేలు

విడిగా అయితే గంటకు 15 వేలు

ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్. పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్. ఇది ఇప్పుడు చాలా సాధారణ అంశంగా మారిపోయింది. ఇలాంటివి అన్నీ ఎక్కువగా ప్రకృతి అందాలతో నిండిన ప్రాంతాల్లో సాగుతున్నాయి. ఇక ఇప్పుడు చారిత్రక ప్రదేశాల్లోనూ వీటికి ఛాన్స్ లభించనుంది. ఎన్నో చారిత్రక ప్రదేశాలు ఉన్న జైపూర్ ఇప్పుడు అధికారికంగా వీటికి ఓకే చెప్పేసింది. రాజస్థాన్ లో చారిత్రక కట్టడాల్లో పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత జరిగే ఫోటో షూట్స్ కు అనుమతి ఇవ్వనున్నారు. కాకపోతే దీనికి రెండు గంటలకు ఐదు వేల రూపాయలు వసూలు చేస్తారు. ఇది సందర్శకులు ఉండే ఆఫీసు సమయాల్లో ఫోటో షూట్ జరుపుకునే వారికి. అలా కాకుండా ఆఫీసు సమయం ముగిసిన తర్వాత విడిగా ఫోటో షూట్ చేసుకోవాలంటే గంటకు 15 వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు రాజస్ధాన్ సర్కారు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

చారిత్రక ప్రదేశాలు, మ్యూజియంల్లో ఇలాంటి వెసులుబాటు కల్పించబోతున్నారు. తమ జీవితంలోని ప్రత్యేక ఘటనలను జీవితాంతం గుర్తు పెట్టుకోవాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని..అందుకే దీనికి అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. పర్యాటక రంగానికి కూడా ఈ నిర్ణయం ఊతం ఇస్తుందని పేర్కొన్నారు. గతంలో పరిమిత సంఖ్యలో ఇలాంటి వాటికి అనుమతి ఇచ్చినా ఈ సారి మాత్రం సంస్థాగతంగా ఈ స్కీమ్ ను అమలు చేయనున్నారు. రాజస్ధాన్ లో ఇలాంటి డిమాండ్ ఉన్న ప్రాంతాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. జైపూర్ లోని అంబర్ ప్యాలెస్, అల్బర్ హాల్, జంతర్ మంతర్, హవా మహల్, నహర్గా, విద్యాదర్ కా బాగ్, సిసోడియా రాణి కా బాగ్ వంటి ప్రదేశాలు ఉన్నాయి.

అయితే ఈ ఫోటో షూట్ కు ఆసక్తి ఉన్న వారు అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ ఫోటో షూట్ జరుపుకోవాల్సి ఉంటుంది. ఏ మతానికి చెందిన వారు మనోభావాలు దెబ్బతినకుండా వీరు ఫోటో షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఫోటో షూట్స్ కార్యక్రమం ఊపందుకున్న విషయం తెలిసిందే. జైపూర్ లాంటి చారిత్రక ప్రదేశాల్లో వీటికి అనుమతి అంటే చాలా మంది ఆ ప్రాంతానికి క్యూ కడతారనటంలో సందేహం లేదు.

Next Story
Share it