Telugu Gateway
Top Stories

అమ్మా...జాక్ మా కన్పించారు

అమ్మా...జాక్ మా కన్పించారు
X

అలీబాబా వ్యవస్థాపకుడు, చైనా బిలీయనీర్ జాక్ మా ఎక్కడ?. అసలు చైనా ప్రభుత్వం ఆయన్ను ఏమి చేసింది?. ఉంటే ఎక్కడ ఉన్నారు. గత కొన్ని నెలలుగా అంతర్జాతీయంగా ఈ అంశం పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఎవరూ దీనిపై ఇంత వరకూ నోరువిప్పే సాహసం చేయలేదు. అయితే జాక్ మా అజ్ణాతం వీడి వెలుగులోకి వచ్చారు.ఆయన బుధవారం నాడు గ్రామీణ పాఠశాల ఉపాధ్యాయులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ లో కనిపించారు. గ్రామీణ ప్రాంత అక్షరాస్యులు సాధించిన విజయాలను ప్రశంసించారు. తొలుత ఇంగ్లీష్‌ టీచర్‌గా పని చేసిన జాక్‌ మా ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని దక్షిణ హైనాన్లోని సన్యాలో నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం కోవిడ్ 19 కారణంగా ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. త్వరలోనే వచ్చి కలుస్తాను అని వారికి తెలిపారు. ఇక జాక్‌ మా వీడియో కాన్ఫరెన్స్‌ కు సంబందించి వీడియో తొలుత ఓ లోకల్‌ బ్లాగ్‌లో ప్రచారం కాగా.. ఆ తర్వాత మీడియా, సోషల్‌ మీడియాలో వైరల్ అయింది.

దీంతో జాక్ మా ఏమైపోయారో అన్న సస్పెన్స్‌ కు తెర పడినట్లు అయింది. చైనాలోని ఆర్థిక నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు తాకట్టు పెట్టుకునే పాన్‌ షాపులుగా మాత్రమే ఉంటున్నాయే తప్ప వినూత్నంగా వ్యవహరించడం లేదంటూ ఓ ఉపన్యాసం సందర్భంగా జాక్ మా అక్టోబర్‌లో వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో పడ్డారు. వ్యాపారపరంగా నవకల్పనల గొంతు నొక్కేసేలా ఉన్న విధానాలను సంస్కరించాలని ఆయన వ్యాఖ్యానించడం చైనా సర్కారుకు ఆగ్రహం తెప్పించింది. అక్కడ నుంచి జాక్‌ మాకు వేధింపులు మొదలయ్యాయి. ఆయనపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. జాక్‌ మాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద యాంట్‌ గ్రూప్‌ ఐపీవో (37 బిలియన్‌ డాలర్లు)నూ నిలిపేసింది. ఆలీబాబా గ్రూప్‌ గుత్తాధిపత్య ధోరణులకు పాల్పడుతోందంటూ ప్రభుత్వం విచారణ మొదలెట్టింది.

Next Story
Share it