ఐవర్‌మెక్టిన్..డీఆర్ డీవో 2 డీజీ డ్రగ్ర్స్ కరోనాపై బ్రహ్మస్త్రాలా?
దేశంలో ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో ఊరటనిచ్చే వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే దేశంలోని ప్రముఖ రక్షణ పరిశోదన, అభివృద్ధి సంస్థ (డీఆర్ డీవో), డాక్టర్ రెడ్డీస్ తో పాటు మరికొన్ని సంస్థలతో కలసి సంయుక్తంగా 2 డీ జీ పేరుతో యాంటీ కోవిడ్ డ్రగ్ ను అందుబాటులోకి తెచ్చింది. పౌడర్ రూపంలో ఉండే ఈ డ్రగ్ కోవిడ్ బారినపడిన వారికి వేగంగా ఊరటనిస్తుందని ప్రకటించింది. దీనికి డీసీజీఐ కూడా అత్యవసర వినియోగ అనుమతి మంజూరు చేసింది. అతి త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో మరో డ్రగ్ కూడా కోవిడ్ నివారణకు ఎంతో ఉపయుక్తంగా ఉందని తేలినట్లు వార్తలు వచ్చాయి. అంతే కాదు..గోవా ప్రభుత్వం పెద్ద వాళ్ళు అందరూ కూడా ఈ డ్రగ్ వాడకానికి అధికారికంగా సిఫారసు చేసింది. నోటి ద్వారా తీసుకొనే ఈ యాంటీ పారాసైటిక్ (పరాన్నజీవుల ద్వారా కలిగే ఇన్‌ఫెక్షన్‌ను నయం చేయడానికి వాడే మెడిసిన్) ఔషధం ఐవర్‌మెక్టిన్ తరచూ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని తెలిపారు.
కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు తాజా పరిశోధనలో తేలిందనే వార్తలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ వెల్లడించింది. ఈ మందు కరోనాను అంతం చేసేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో పాల్గొన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు. ఐవర్‌మెక్టిన్‌పై ఉన్న సమాచారాన్నంతా క్రోడీకరించి ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జనవరిలో మొత్తం 27 కంట్రోల్డ్ ట్రయల్స్ జరిపామని, అందులో 15 రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద దీన్ని పరీక్షించి... ఫలితాలను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా, రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు. ఐవర్‌మెక్టిన్ వాడితే కరోనా సోకే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని తెలిపారు. ఈ మందును ఇప్పటికే పలు చోట్ల వినియోగిస్తున్నారని, అన్ని చోట్ల ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు వెల్లడించారు. నిపుణులు చెబుతున్నట్లు ఈ రెండు మందులు కరోనాపై మంచి ఫలితాలు ఇస్తే దేశానికి పెద్ద ఊరట లభించినట్లే.