ఐటి రిటర్న్స్ దాఖలు గడువు పెంపు
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి 2020-21 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన రిటర్న్స్ సెప్టెంబర్30లోగా దాఖలు చేయాల్సి ఉంది. అయితే కొత్తగా డెవలప్ చేసిన ఐటి పోర్టల్ లో సాంకేతిక సమస్యలు తలెత్తటం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇదే అంశంపై ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఇన్ఫోసిస్ సీఈవోకు సమన్లు జారీ చేసి మరీ పిలించి సమస్యలు పరిష్కరించాల్సిందిగా గడువు విధించారు. అయినా సమస్య ఇంకా కొలిక్కివచ్చినట్లు లేదు.
అదే సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని సీబీడీటీ తాజాగా ఈ గడువును డిసెంబర్ 31 వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటి రిటర్న్స్ దాఖలు చేయాల్సిన వారికి ఊరట లభించినట్లు అయింది. ఐటి పోర్టల్ లో సాంకేతిక సమస్యలతో చార్టెట్ అకౌంటెంట్లు కూడా నానా సమస్యలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఉన్న పోర్టల్ లో పని ఎంతో సాఫీగా సాగిపోయేదని..కొత్తది తెస్తే పని మరింత సులభతరం కావాలి కానీ..ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిందని వ్యాఖ్యానిస్తున్నారు.