ఐటి పోర్టల్...అప్పటిలోగా సమస్యలు పరిష్కరించాలి
ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలుకు సంబంధించి సిద్ధం చేసిన కొత్త పోర్టల్ పై కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పోర్టల్ ను ప్రముఖ ఐటి సంస్థ ఇన్ఫోసిస్ దీన్ని డెవలప్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ఏకంగా 165 కోట్ల రూపాయలు చెల్లించారు. అయితే నిత్యం సాంకేతిక సమస్యలు వస్తుండటంతో పన్ను చెల్లింపుదారులు రిటర్న్స్ దాఖలు విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ కు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆయన సోమవారం నాడు ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ తోపాటు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం అయిన వివరణ ఇచ్చారు.
రెండున్నర నెలల తర్వాత కూడా ఇంకా సాంకేతిక సమస్యలు రావటం పట్ల సర్కారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసి..సెప్టెంబర్ 15లోగా సమస్యలు అన్నీ పరిష్కరించాలని డెడ్ లైన్ విధించింది. 750 మంది సిబ్బంది దీనిపై పనిచేస్తున్నారని..సీవోవో ప్రవీణ్ రావు స్వయంగా ఈ ప్రాజెక్టు పనులు చూస్తున్నారని ఆయన వివరణ ఇచ్చారు. ఐటి పోర్టల్ లో సమస్యలు వస్తుండటంతో సెప్టెంబర్ నెలాఖరు వరకూ ఉన్న రిటర్న్స్ దాఖలు గడువును మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని సమాచారం.