ఇరాన్ తో చర్చలు సాగుతున్నాయి

అమెరికా-ఇజ్రాయెల్ లు ఎంత భీకరంగా దాడులు చేసినా..ఎంత నష్టం చేసినా కూడా ఇరాన్ ఏ మాత్రం మాత్రం వెనక్కి తగ్గలేదు. హర్ముజ్ జలసంధిని 48 గంటల్లో ఓపెన్ చేయకపోతే ఇరాన్ లోని అతి పెద్ద విద్యుత్ వ్యవస్థలపై దాడిచేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గని ఇరాన్ తమ మౌలిక సదుపాయాల జోలికి వస్తే గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ నిక్షేపాలపై దాడులు చేయటంతో పాటు అన్ని డీశాలినేషన్ ప్లాంట్స్ కూడా నాశనం చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా హెచ్చరికల కంటే ఇరాన్ చేసిన హెచ్చరికలు ప్రపంచానికి అత్యంత ప్రమాదకరమైనవిగా మారాయి. ఎందుకంటే ఇరాన్ గల్ఫ్ లోని ఆయిల్ నిక్షేపాలపై దాడి చేస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్ రేట్లు మరింత పెరుగుతాయి. డీశాలినేషన్ ప్లాంట్స్ పై దాడి చేస్తే గల్ఫ్ దేశాల్లో తాగు నీరు కూడా ఉండదు.
ఇప్పటికే ఈ యుద్ధం కారణంగా భారీగా నష్టపోయిన గల్ఫ్ దేశాలు మరింత నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఈ తరుణంలో డోనాల్డ్ ట్రంప్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. రెండు రోజులుగా ఇరాన్ తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి అని..ఈ తరుణంలో ఐదు రోజుల వరకు ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేయబోము అని ప్రకటించారు. పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి అని చెప్పారు. చర్చల ఫలితాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఆధారపడి ఉంటుంది అన్నారు. ఈ చర్చలు వారం పాటు కొనసాగే అవకాశం ఉంది అన్నారు. అసలు ఇరాన్ తో చర్చల ప్రసక్తే లేదు అని..అక్కడ అసలు ఎవరు ఉన్నారు చర్చించటానికి అంటూ మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ ఇప్పుడు చర్చలు సానుకూలంగా సాగుతున్నాయి అని ప్రకటించటం విశేషం. విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామంటూ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత ఇరాన్ చాలా సీరియస్ గా స్పందించింది.
ట్రంప్ ప్రకటన కంటే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు ప్రపంచాన్ని ఎక్కువ కలవరానికి గురిచేశాయి. కాదు కూడదు అని దురాక్రమణకు దిగితే పర్షియన్ గల్ఫ్ ప్రాంతం అంతా సీ మైన్స్ పెడతామని కూడా ఇరాన్ హెచ్చరించింది. మరో వైపు ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికాలో కూడా డోనాల్డ్ ట్రంప్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఇటీవల వెలువడిన సర్వే లు కూడా ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఐదు రోజుల పాటు ఇరాన్ విద్యుత్ ప్లాంట్స్ పై దాడులు ఉండవు అని .. చర్చలు జరుగుతున్నాయి అని డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పై ఇరాన్ కూడా స్పందించింది. తమ హెచ్చరికల కారణంగానే ట్రంప్ వెనక్కి తగ్గారు అని ప్రకటించారు. అదే సమయంలో తాము ప్రత్యక్షంగా...పరోక్షంగా ఎవరితో చర్చలు జరపలేదు అని ఇరాన్ చెపుతుండటం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. మరి రాబోయే రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.



