భద్రతా హెచ్చరికలతో సందేహలు !

ఇరాన్ తో యుద్ధం మాకు పెద్ద లెక్క కాదు. మా పని పూర్తి చేయటానికి మహా అంటే రెండు నుంచి మూడు వారాల సమయం కంటే ఎక్కువ పట్టదు. ఇది అమెరికా-ఇజ్రాయిల్ లు ఇరాన్ పై దాడులు ప్రారంభించిన సమయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ పలు మార్లు చేసిన వ్యాఖ్యలు. వీటిని బట్టి చూస్తేనే డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో లెక్కలు ఎంత తప్పుగా వేసుకున్నారో అర్ధం అవుతోంది. ఈ యుద్ధం మొదలై ఏడవ నెలలోకి ప్రవేశించినా కూడా డోనాల్డ్ ట్రంప్ కు దీన్ని ఎలా ముగించాలో దిక్కుతోచడం లేదు. నిత్యం గందరగోళ ప్రకటనలు చేస్తూ ఆయన ఈ విషయాన్ని సాగదీస్తూ ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారు. ముఖ్యంగా ఈ యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభంతో ఆర్థికంగా పలు దేశాలు ఉక్కరిబిక్కిరి అవుతున్నాయి. ఇప్పుడు మరో సారి అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరో సారి రెండు దేశాలు దాడులు చేసుకుంటాయా లేక చివరి నిమిషంలో ఏమైనా డోనాల్డ్ ట్రంప్ రాజీకివస్తారా అన్నది కొద్ది గంటలు పోతే కానీ తెలవదు. తాజా పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉన్న అమెరికా పౌరులకు ఆ దేశం భద్రత హెచ్చరికలు జారీ చేసింది. పరిస్థితులు చాలా వేగంగా మారిపోయే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది.
అమెరికన్లు అప్రమత్తంగా ఉండాలని, గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలని...కొత్తగా ఆ ప్రాంతానికి వెళ్లే వాళ్ళు, అక్కడి నుంచి ప్రయాణించే వారు విమాన సర్వీసులు, విమానాశ్రయాల తాజా సమాచారాన్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. విమానాల రద్దు, గగనతల మూసివేత, ఇతర ప్రయాణ అంతరాయాలు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ అలెర్ట్ తోనే మరో సారి ఇరాన్ పై అమెరికా దాడులు చేసే అవకాశం ఉంది అనే చర్చ సాగుతోంది. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌పై యెమన్ కు చెందిన హౌతీలు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసినట్లు ప్రకటించిన తరుణంలో అమెరికా తాజా హెచ్చరిక వెలువడింది. అమెరికా తాజాగా జారీ చేసిన హెచ్చరిక పశ్చిమాసియాలోని పలు దేశాలోని అమెరికా ప్రజలకు వర్తించనుంది. ఇందులో బహ్రెయిన్, ఈజిప్ట్, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, సిరియా, యూఏఈ, యెమెన్ తదితర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇది ఇలా ఉంటే గత ఏడు నెలలుగా కొనసాగుతున్న పశ్చిమాసియా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికాకు ఇరాన్ 7 షరతులు పెట్టింది. తమ డిమాండ్లను అంగీకరించకపోతే నిర్ణయాత్మక యుద్ధానికి సిద్ధమంటూ ఇరాన్ హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. ఖతార్ ద్వారా అమెరికాకు ఈ షరతులు చేరాయి. అయితే ఇప్పటిదాకా ట్రంప్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తాము చర్చల్లో పాల్గొనాలంటే ఖచ్చితంగా తమ డిమాండ్లను అంగీకరించాల్సిందేనని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ మొహసెన్ రెజాయీ తెలిపారు. ‘యుద్ధాన్ని ముగించాలనే లక్ష్యంతో 7 షరతులను మధ్యవర్తిగా ఉన్న ఖతార్ ద్వారా అమెరికాకు పంపించాం’ అని ఆయన వెల్లడించారు. యుద్ధానికి ముగింపు, అమెరికా స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తుల విడుదల, నౌక మార్గాలపై అమెరికా దిగ్బంధం ఎత్తివేత వంటివి ఈ షరతుల్లో ఉన్నాయంటూ వివరించారు. షరతులకు అంగీకరిస్తారా లేదా అనేది అమెరికా ఇష్టమని రెజాయీ స్పష్టం చేశారు.
అదే సమయంలో అణు పరీక్షలకు దూరంగా ఉంటామని గతంలో చేసుకున్న ఒప్పందాలను ఉల్లంఘించాలని తమకు లేదని, కానీ అలాంటి నిర్ణయాలు తీసుకునేలా అమెరికా చర్యలుంటున్నాయని పేర్కొన్నారు. అలాగే అణ్వాయుధాలకు వ్యతిరేకంగా తమ మత శాసనాలకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు. మరో వైపు యూకే లోని ఆర్ఏఎఫ్ ఫెయిర్ ఫోర్డ్ నుంచి బీ 1 బాంబర్ బయలుదేరివెళ్లినట్లు అంతర్జాతీయ మీడియా లో వార్తలు వచ్చాయి. దీంతో మరో సారి అమెరికా ఇరాన్ పై యుద్దానికి సిద్ధం అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇరాన్ కూడా హై అలెర్ట్ జారీ చేసినట్లు చెపుతున్నారు. అయితే ఈ బీ 1 బాంబర్ ఇరాన్ వైపు వెళుతుందా లేక మరో ప్రాంతానికా అన్న విషయం పై స్పష్టత లేదు.



