అమెరికాకు సహకరిస్తే మూల్యం తప్పదు

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎన్ని హెచ్చరికలు చేస్తున్నా ఇరాన్ ఏ మాత్రం వెనక్కితగ్గటం లేదు. హార్ముజ్ జలసంధిలో ప్రయాణించే నౌకలపై ఎలాంటి దాడులు ఉండబోవు అని ప్రకటించాలని ట్రంప్ డిమాండ్ చేస్తే...తాజా దాడులతో ఏకంగా హర్ముజ్ ను మళ్ళీ మూసివేస్తున్నట్లు ప్రకటించింది ఇరాన్. అయితే అమెరికా మాత్రం హర్ముజ్ జలసంధి తెరిచే ఉంది అని చెపుతోంది. ఎలాగైనా ఇరాన్ ను దారికి తెచ్చుకోవాలనే లక్ష్యంతో అమెరికా వరుసగా ఇరాన్ పై పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది. అయితే ఇరాన్ ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా గల్ఫ్ దేశాల్లోని అమెరికా బేస్ లపై విరుచుకుపడుతోంది. దీంతో మరో సారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి అనే చెప్పాలి. రెండు దేశాలు వరస దాడులకు దిగటంతో మరో సారి క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగాయి. అమెరికా జరిపిన తాజా సైనిక దాడులపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ దాడులను ఐక్యరాజ్యసమితి చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘించడమేనని అభివర్ణించిన ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాషింగ్టన్ చర్యలు ప్రాంతీయ స్థిరత్వాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని దెబ్బతీస్తున్నాయని ఆరోపించింది.
ఇది ముమ్మాటికీ ప్రాంతీయ ఉద్రిక్తతలను మరింత పెంచడమేనని ఆరోపించింది. ఈ మేరకు ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, అమెరికాకు సహకరించే దేశాలకు ఇరాన్ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.అమెరికా తమపై దాడులు చేయడానికి ఏ దేశమైనా తన భూభాగాన్ని, సదుపాయాలను ఉపయోగించుకోవడానికి అనుమతిస్తే, ఆ దేశాలను కూడా తాము శత్రువులుగానే పరిగణిస్తామని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ సాయుధ దళాల రక్షణాత్మక చర్యల్లో భాగంగా వాటిని చట్టబద్ధమైన లక్ష్యాలుగా చూస్తాం'. అని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. అంతే కాదు అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మరో సారి కువైట్, జోర్డాన్, బహ్రెయిన్ లోని అమెరికా బేస్ లపై దాడులు చేసింది. అమెరికా అంతకు ముందు హర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ దక్షిణ తీర ప్రాంత నగరాలు బందర్ మషెహర్, బందర్ అబ్బాస్, హెండిజాన్, బుషెహర్, అసల్యుయె, కంగాన్, జాస్క్‌లతోపాటు రాజధాని టెహ్రాన్‌పైనా బాంబులు, క్షిపణులు వేసింది.
మొత్తం 140 లక్ష్యాలపై దాడులు చేశామని.. క్షిపణి, డ్రోన్ లాంఛర్లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, సమాచార, నిఘా వ్యవస్థలను ధ్వంసం చేశామని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. హార్ముజ్ లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులు చేసే సామర్థ్యాన్ని దెబ్బతీసినట్టు తెలిపింది. మరో వైపు కువైట్‌లో అమెరికా పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ, ఆయుధ డిపో, రాడార్లను ధ్వంసం చేసినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్‌బే్‌సలో యుద్ధ విమానాల మరమ్మతుల కేంద్రం, కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ధ్వంసం చేసినట్టు తెలిపింది. ఇరాన్ క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా అడ్డుకున్నామని.. అయితే వాటి శకలాలు పడి, పేలుళ్లు జరిగి ఒక చిన్నారి సహా ముగ్గురు గాయపడ్డారని ఖతార్ ప్రకటించింది.



