Telugu Gateway
Top Stories

ఇరాన్ వార్నింగ్ తో ఆగిన షిప్స్

ఇరాన్ వార్నింగ్ తో ఆగిన షిప్స్
X

ఇండియా తన ఇంధన అవసరాల కోసం ఎక్కువ శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది అనే విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడు ఇండియా ఆయిల్ అవసరాలకు పెద్ద ఇబ్బంది లేకపోయినా కూడా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య సాగుతున్న యుద్ధం ఎక్కువ రోజులు కొనసాగితే మాత్రం ఇబ్బందులు తప్పేలా లేవు . గతానికి భిన్నంగా ఈ సారి ఇరాన్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలను కూడా వదలటం లేదు . ముఖ్యంగా ఆయా దేశాల్లో ఉన్న అమెరికా బేస్ లను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగుతోంది. కొన్ని ఎంపిక చేసిన అమెరికా కంపెనీలను కూడా టార్గెట్ చేస్తోంది. కారణాలు ఏమైనా ఈ యుద్ధం తో ఇప్పుడు ప్రపంచ వాణిజ్యంపై, అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక మార్గమైన హోర్ముజ్ జలసంధిని మూసేస్తున్నట్టు ఇరాన్ ప్రకటించడం ఆసియా దేశాలను వణికిస్తోంది.

హోర్ముజ్ జలసంధి ఇరాన్, ఒమన్‌ల మధ్య ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్‌ను, ఒమన్ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో కలుపుతుంది. దాదాపు 167 కిలోమీటర్ల పొడవైన ఈ జలసంధి 33 కిలోమీటర్ల వెడల్పుతో ఉంటుంది. ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో దాదాపు 20 శాతం ప్రతిరోజూ ఈ కారిడార్ నుంచే జరుగుతుంది. రోజుకు దాదాపు 22 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు ఆసియా దేశాలకు సరఫరా అవుతుంది. అలాగే ఖతార్ నుంచి ఎల్‌ఎన్‌జీ భారీగా ఈ మార్గం నుంచే ఇతర దేశాలకు ఎగుమతి అవుతుంది అనే విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉద్రిక్తతల కారణంగా డజన్ల కొద్దీ ట్యాంకర్లు గల్ఫ్ వెలుపల లంగరు వేసి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడు సముద్రంలో ట్రాఫిక్ జామ్ అయింది. హోర్ముజ్ జలసంధిని మూసి వేశాం అని...ఇటు వైపు నౌకలు వస్తే తగలబెడతామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇదే ఇప్పుడు హోర్ముజ్ లో నౌకల ట్రాఫిక్ జామ్ కు కారణం అయింది.

భారతదేశం తన ముడి చమురు దిగుమతుల్లో దాదాపు 55% మధ్యప్రాచ్యం నుంచి దిగుమతి చేసుకుంటుంది. రోజుకు దాదాపు 2.7 మిలియన్ బ్యారెళ్లు ఈ మార్గం ద్వారానే దిగుమతి అవుతాయి. మనదేశంలో చమురు నిల్వ సామర్థ్యం దాదాపు 74 రోజులకు మాత్రమే సరిపోతుంది అనే అంచనాలు ఉన్నాయి . ఈ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని మూసివేస్తే భారత్‌పై తీవ్ర ప్రభావం పడుతుంది. బ్రెంట్ ముడి చమురు ధర పెరుగుదల నేరుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంది. ఇంధన ధరల పెరుగుదల రవాణా, ఆహారం, తయారీ రంగాలపై ప్రభావం చూపుతుంది. ఫలితంగా ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు మొదలవుతాయి. చమురు కోసం అధికంగా ఖర్చు పెట్టడం సాధారణంగానే రూపాయిని బలహీనపరుతుంది. ఇప్పటికే రూపాయి పతనం కారణంగా దిగుమతుల వ్యయం పెరగడం వల్ల విదేశీ మారక నిల్వలు దెబ్బతింటున్నాయి. ఈ ప్రమాదం మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరాన్ ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద చమురు నిల్వలను కలిగిన దేశం. చైనా పెద్ద మొత్తంలో ఇరాన్ నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. భారత్‌కు కూడా ఇరాన్ చమురు ఎగుమతి చేస్తుంది. హోర్ముజ్‌ను మూసివేస్తే ఇరాన్ కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. అయినా సరే ఇప్పుడు ఈ విషయంలో ఏ మాత్రం వెనకాడటం లేదు.

Next Story
Share it