Telugu Gateway
Top Stories

యుద్ధం మరింత తీవ్రరూపం!

యుద్ధం మరింత తీవ్రరూపం!
X

అమెరికా, ఇరాన్ ల మధ్య యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే తాము అమెరికా తో పూర్తి స్థాయి యుద్ధంలోనే ఉన్నామని ఇరాన్ చెపుతోంది. గత పది రోజులకు పైగా ఇరాన్ పై అమెరికా వరస దాడులు చేస్తూనే ఉంది. అమెరికా దాడులు ఇలాగే కొనసాగితే అమెరికాపై 9/11 తరహా దాడులు చేస్తామన్న ఇరాన్‌ హెచ్చరించింది. ఇప్పుడు ఇది పెద్ద సంచలనంగా మారింది. యుద్ధం ఇలాగే కొనసాగితే అమెరికాలో జాతీయ సంతాప దినాలు ప్రకటించాల్సి ఉంటుంది అని చెప్పింది. ఈ మేరకు ఇరాన్‌ ప్రభుత్వ అనుబంధ వార్తాసంస్థ 'తస్నిమ్‌' ప్రకటన చేయటంతో ఈ వ్యవహారం ఏ మలుపులు తీసుకుంటాయో అన్న ఆందోళన ప్రపంచ దేశాల్లో వ్యక్తం అవుతోంది. హోర్ముజ్ జలసంధి కేంద్రంగా ఇరాన్, అమెరికా దేశాల మధ్య మాటల యుద్ధం కాస్తా.. ప్రతీకార దాడుల హెచ్చరికలకు దారితీసింది. ఇరాన్ ఒక్క నౌకపై దాడిచేసినా తాము ఆ దేశంలో బ్రిడ్జిలు..విద్యుత్ మౌలిక సదుపాయాలు ధ్వంసం చేస్తామని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.

దీనికి ప్రతిగానే ఇరాన్ 9 /11 తరహా దాడులు చేస్తామని హెచ్చరికలు చేసింది. 2001 సెప్టెంబర్ 11 న నాలుగు వాణిజ్య విమానాలను హైజాక్ చేసిన టెర్రరిస్టులు వరల్డ్ ట్రేడ్ సెంటర్ తో పాటు పెంటగాన్ తదితర ప్రాంతాలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపైనే ఇరాన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. అమెరికా కనుక ఇరాన్ లో ఏ ఒక్క బ్రిడ్జిని లేదా పవర్ ప్లాంట్‌ను లక్ష్యంగా చేసుకున్నా... తాము ఈ ప్రాంతంలోని మౌలిక సదుపాయాలతో పాటు అమెరికాకు ప్రయోజనం కల్పించే చమురు కేంద్రాలను సమూలంగా ధ్వంసం చేస్తాం అని ఇరాన్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ స్పందిస్తూ... తమ దేశం 'కంటికి కన్ను' విధానాన్ని పాటిస్తుందని, తమ దేశ మౌలిక సదుపాయాలపై జరిగే ఏ దాడికైనా అంతే తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు.

ఒకవైపు హెచ్చరికలు కొనసాగుతుండగానే, మరోవైపు సైనిక చర్యలు తీవ్రమవుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి పై తమకే పూర్తి సార్వభౌమాధికారం ఉందని ఇరాన్ స్పష్టం చేసింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఈ జలసంధి నుంచి వెళ్లేందుకు ప్రయత్నించిన మూడు చమురు ట్యాంకర్లను అడ్డుకున్నారు. ఇందులో ఒక నౌక పేలిపోయి అగ్నిప్రమాదానికి గురికాగా, మిగిలిన రెండు నౌకలు వెనక్కి మళ్లినట్లు ఇరాన్ ప్రకటించింది. ట్రంప్ మాత్రం ఇరాన్ ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే అని..అసలు సినిమా ముందు ఉంది అని చెపుతున్నారు. ఇరాన్ క్రూడ్ ఆయిల్ సరఫరాను అడ్డుకుంటే ఏ గల్ఫ్ దేశం కూడా క్రూడ్ సరఫరా చేయలేని పరిస్థితి కల్పిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. గల్ఫ్ లో ఉద్రిక్తలు గతం కంటే మరింత తీవ్ర రూపం దాల్చటంతో చమురు ధర రోజుకో కొత్త గరిష్ట స్థాయికి చేరుతోంది.

Next Story
Share it