ఇరాన్ కు మరో పది రోజులు గడువు

ప్రపంచానికి యుద్ధ అనిశ్చితి మరికొన్ని రోజులు తప్పేలా లేదు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ లు సంయుక్తంగా చేస్తున్న దాడుల విషయంలో అమెరికా విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఇజ్రాయెల్ మాత్రం తన దాడులు కొనసాగిస్తోంది..ఇరాన్ కూడా ఎప్పటిలాగానే ఎదురుదాడులకు దిగుతోంది. చర్చలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను మాత్రం ఇరాన్ నేతలు లైట్ తీసుకుంటున్నట్లు ప్రకటనలు చేస్తున్నారు. తొలుత తాము చెప్పినట్లు వినకపోతే ఇరాన్ లోని విద్యుత్ కేంద్రాలను ధ్వంసం చేస్తామని ట్రంప్ హెచ్చరించడంతో అదే జరిగితే గల్ఫ్ దేశాల్లోని డీశాలినేషన్ ప్లాంట్స్ తో పాటు ఆయిల్ నిక్షేపాలను కూడా టార్గెట్ చేస్తామని ఇరాన్ తీవ్ర హెచ్చరికలు చేసింది. దీంతోనే అమెరికా వెనక్కి తగ్గింది. తాజాగా డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు మరో పది రోజులు గడువు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందుకే తాము ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులను ఏప్రిల్ ఆరు వరకు వాయిదా వేసుకున్నట్లు చెప్పారు. అయితే ఇరాన్ తో చర్చలకు సంబంధించి డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలను మాత్రం ఇరాన్ ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతోంది.
తమ మిత్ర దేశాలతో కొన్ని ప్రతిపాదనలు పంపింది అని...అయితే అవి తమకు ఏ మాత్రం ఆమోదయోగం కాదు అంటూ కూడా ఇరాన్ కూడా పలు డిమాండ్లను అమెరికా ముందు ఉంచింది. మరి డోనాల్డ్ ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త గడువులోపు అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ లు ఒక అంగీకారానికి వస్తే మాత్రం ప్రపంచానికి పెద్ద ఊరట దక్కినట్లు అవుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. డోనాల్డ్ ట్రంప్ తాజా ప్రకటన చూస్తే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దౌత్యపరమైన వ్యూహంతో ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది. ఇరాన్ పై దాడికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుండంతో ట్రంప్ కూడా ఎలాగోలా దీనికి ముగింపు పలకటంపైనే ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది అనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. ఇరాన్ ప్రభుత్వం తమ ప్రతినిధుల ద్వారా దాడుల నిలిపివేతకు మరికొంత సమయం కావాలని కోరినట్లు ట్రంప్ వెల్లడించారు.
వాళ్ళు నన్ను చాలా మర్యాదగా 7 రోజులు సమయం అడిగారు, కానీ నేను వారికి 10 రోజులు ఇచ్చాను అని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ ప్రభుత్వం చర్చలకు సానుకూలంగా స్పందిస్తూ, అంతకుముందు నిలిపివేసిన 8 చమురు ట్యాంకర్లను స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గంలో ప్రయాణించేందుకు అనుమతించిందని, దానిని గౌరవిస్తూనే ఈ అదనపు సమయాన్ని ఇచ్చినట్లు ట్రంప్ వివరించారు. ప్రస్తుతం ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు చాలా బాగున్నాయని, ఉత్పాదకతతో కూడి ఉన్నాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా తెలిపారు. తప్పుడు వార్తలు ప్రచారం చేసే మీడియా మాటలను నమ్మవద్దని ఆయన ప్రజలను కోరారు. ఒకవేళ ఈ లోపు ఇరాన్ శాంతి చర్చలకు పూర్తిగా అంగీకరించకపోతే, వారి అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తానని ఆయన హెచ్చరించారు.



