వీడని హర్ముజ్ జలసంధి పీఠముడి

ఇరాన్ తమతో ఒప్పందం చేసుకునేందుకు తహతహలాడుతోంది...ప్రాధేయ పడుతోంది అని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికి ఎన్ని సార్లు చెప్పారో లెక్కే లేదు. కానీ వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. అమెరికా పెడుతున్న షరతులను ఇరాన్ ఒప్పుకోవటం లేదు..అందుకే ఒప్పందం తుది రూపం తీసుకోవటం లేదు. గత కొన్ని రోజులుగా కాల్పుల విరమణ ఒప్పందం సాఫీగానే సాగినా కూడా గత రెండు రోజులుగా మళ్ళీ అమెరికా ఇరాన్ పై దాడులకు దిగుతోంది. ఇది కేవలం ఆత్మరక్షణ కోసం చేస్తున్న దాడులుగా అమెరికా చెపుతోంది. ముఖ్యంగా హర్ముజ్ జలసంధి దగ్గర లో ఉన్న క్షిపణి ప్రయోగ కేంద్రాలను అమెరికా టార్గెట్ చేస్తోంది. ఇరాన్ తమపై దాడి చేసే అవకాశం ఉండటంతో తాము ముందు జాగ్రత్త చర్యగా తమ దళాల రక్షణ కోసం ఈ దాడులు చేశామని అమెరికా చెపుతోంది. అయితే కాల్పుల విరమణ సమయంలో అమెరికా చేస్తున్న దాడులపై ఇరాన్ మండిపడుతోంది.
కొద్ది రోజుల క్రితం అమెరికా-ఇరాన్ ల మధ్య ఒప్పందం తుది దశకు చేరుకుంది అని వార్తలు వచ్చిన తర్వాత మళ్ళీ అమెరికా వరసగా ఇరాన్ పై దాడులు చేస్తుండంతో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో అన్నది ఇప్పుడు పలు దేశాలను ఆందోళనకు గురి చేస్తోంది. ఇరాన్‌లోని కీలక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా తాజాగా వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ప్రాంతంలో ఉన్న ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా సైన్యం దాడి చేసింది. అలాగే హోర్ముజ్ జలసంధి సమీపంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలకు ముప్పుగా పరిణమించిన నాలుగు ఇరానియన్ డ్రోన్లను కూడా కూల్చివేసినట్టు అమెరికా సైన్యం పేర్కొంది. ప్రస్తుతం జరుగుతున్న శాంతి చర్చల ప్రక్రియను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని టెహ్రాన్ ఆరోపించింది. మరో వైపు ఇరాన్ తో శాంతి చర్చల అంశంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చర్చలు విఫలమైతే రక్షణ మంత్రిని రంగంలోకి దింపి ఇరాన్ పనిపడతాం అంటూ హెచ్చరించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమయింది అని...అమెరికాతో ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ కోరుకుంటుంది అని మరో సారి చెప్పుకొచ్చారు.
ఇరాన్ లో ఏకంగా 250 శాతం ద్రవ్యోల్బణం ఉంది.. ఇరాన్ కరెన్సీకి ఎలాంటి విలువ లేకుండా పోయింది అన్నారు. హార్ముజ్ జలసంధి ఇకపై అందరికీ తెరిచే ఉంటుంది..హార్ముజ్ అంశంలో ఒమన్ తమకు సహకరించకపోతే ఆ దేశాన్ని కూడా పేల్చేస్తాం అంటూ డోనాల్డ్ ట్రంప్ సంచనల వ్యాఖ్యలు చేశారు. అమెరికా తమపై చేసిన దాడులకు ప్రతిగా తాము అమెరికా సైనిక స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ చెపుతోంది. అయితే ఎక్కడ ఈ దాడులు జరిగాయి అన్న అంశంపై స్పష్టత లేదు. అయితే కువైట్ మాత్రం తమ దేశం వైపు క్షిపణులు ..డ్రోన్లు రాగా వాటిని తాము అడ్డుకున్నామని ప్రకటించింది.



