Telugu Gateway
Top Stories

అయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !

అయతుల్లా అలీ ఖమేనీ జోలికి వస్తే అంతే !
X

అమెరికా, ఇరాన్ ల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తమ నాయకుడి జోలికి వస్తే వాళ్ళ ప్రపంచం మొత్తానికి నిప్పు పెడతాం అంటూ ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబాఫేజ్ల్ షెకార్చి హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్ లో నాయకత్వ మార్పు జరగాల్సిన అవసరం ఉంది అని చెపుతూ వస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి కొద్దిరోజుల క్రితమే అమెరికా తమ మాటలను ఏ మాత్రం పట్టించుకోని ఇరాన్ పై దాడికి సిద్ధం అయినా కూడా పలు దేశాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా చివరి నిమిషంలో వెనక్కి తగ్గినట్లు వార్తలు వచ్చాయి. తాజాగా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ లో ఇలాగే అశాంతి కొనసాగితే “మొత్తం దేశమే పేలిపోతుంది” అని టెహ్రాన్ ను హెచ్చరించారు.

ఇరాన్ చేసిన ‘సంపూర్ణ యుద్ధం’ హెచ్చరిక పై ట్రంప్ స్పందిస్తూ ఇరాన్ తన జోలికి వస్తే అసలు ప్రపంచంలో ఇరాన్ అన్నదే లేకుండా చేస్తాను అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు ఏదైనా జరిగితే, తాము వాళ్ళను భూమి మీద నుంచి పూర్తిగా తుడిచిపెట్టేస్తాం అని...ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. తమ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖామెనీపై పై చర్య తీసుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అంటూ ఇటీవల ఇరాన్ హెచ్చరిక జారీ చేసింది. “మా నాయకుడిపై దాడి చేయడానికి ఏదైనా చేయి ముందుకు సాగితే, ఆ చేయిని కత్తిరించడమే కాకుండా వారి ప్రపంచానికే నిప్పంటిస్తాం అని ట్రంప్‌కు తెలుసు” అని ఇరాన్ సాయుధ దళాల ప్రతినిధి జనరల్ అబోల్ఫజల్ షేకార్చీ తెలిపినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

ఇరాన్ లో సాగుతున్న నిరసనల కారణంగా ఇప్పటివరకు 4,500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు అని నివేదికలు చెపుతున్నాయి. అయితే వీటిని నిర్దారించేవాళ్ళు ఎవరూ లేరు అనే చెప్పొచ్చు. గత కొంత కాలంగా ఇరాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, రియాల్ విలువ పతనం కారణంగా డిసెంబర్ చివరి వారం నుంచి ఇరాన్‌లో నిరసనలు ప్రారంభమయ్యాయి. వేలాది ఇరానీయులు చర్యలు తీసుకోవాలని, పాలన మార్పు కోరుతూ వీధుల్లోకి దిగగా, తేహ్రాన్‌లో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం మరియు నిరసనలకు మద్దతు ఇవ్వడం వెనుక అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయని ఇరాన్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఒక్క ఇరాన్ విషయంలోనే కాకుండా డోనాల్డ్ ట్రంప్ పలు దేశాల విషయంలో జోక్యం చేసుకుంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

డోనాల్డ్ ట్రంప్ రెండవ సారి అమెరికా అధ్యక్షడిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి అయింది. ఆయన బాధ్యతలు చేపట్టిన వెంటనే తీసుకున్న పలు నిర్ణయాలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపించిన సంగతి తెలిసిందే. ఇందులో మొదటిది వాణిజ్య సుంకాలు అనే చెప్పొచ్చు. డోనాల్డ్ ట్రంప్ సుంకాల నిర్ణయంతో ప్రపంచ వ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇప్పటికీ ఇంకా ఆ అనిశ్చితి అలా కొనసాగుతూనే ఉంది. ఇండియా పై విధించిన 50 శాతాలు సుంకాలు అలాగే ఉన్నాయి. దీంతో పాటు ఐటి కంపెనీలపై పెద్ద ఎత్తున ప్రభావం చూపించేలా హెచ్ 1 బీ వీసా ఫీజు ను లక్ష డాలర్లుగా చేయటం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో భారతీయ ఐటి నిపుణులపై అత్యంత ప్రతికూల ప్రభావం చూపించే నిర్ణయంగా చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా లో చదువుకునే విద్యార్థుల విషయంలో కూడా పలు కఠిన ఆంక్షలు పెట్టడమే కాకుండా సోషల్ మీడియా ఖాతాల వెట్టింగ్ వంటి నిర్ణయాలతో అందరిని గందరగోళంలోకి నెట్టాడు. అయితే వైట్ హౌస్ మాత్రం డోనాల్డ్ ట్రంప్ తన తొలిఏడాది కాలంలో 365 రోజులు 365 విజయాలు సాధించినట్లు చెపుతోంది. ఇందులో సరిహద్దుల రక్షణ తో పాటు అమెరికా సత్తాను ప్రపంచానికి తిరిగి చాటడం, దిగ్గజ కంపెనీల నుంచి భారీ పెట్టుబడులు సాధించటం వంటి వాటిని ప్రస్తావించారు. డోనాల్డ్ ట్రంప్ ఏడాది కాలంగా ద్రవ్యోల్భణం భారీగా తగ్గింది అని...ప్రజల ఆదాయం పెరిగింది అన్నారు. అదే సమయంలో మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ పాలనపై విమర్శలు గుప్పించారు.

Next Story
Share it