Telugu Gateway
Top Stories

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు సాధార‌ణ స్థితికి!

అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు సాధార‌ణ స్థితికి!
X

గుడ్ న్యూస్. త్వ‌ర‌లోనే సాధార‌ణ స్థితి రానుంది. ముఖ్యంగా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌కు సంబంధించి. అంత‌కు ముందు వ‌లే ఎక్క‌డ‌కు అంటే అక్క‌డ‌కు ఎగిరిపోవ‌టానికి వాతావ‌ర‌ణం అనుకూలంగా మారుతోంది. ఈ సంవ‌త్స‌రాంతం నాటికి అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసులు సాధార‌ణ స్థితికి చేరుకుంటాయ‌ని పౌర‌విమాన‌యాన శాఖ కార్య‌ద‌ర్శి రాజీవ్ బ‌న్స‌ల్ వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం భార‌త్ న‌వంబ‌ర్ నెలాఖ‌రు వ‌ర‌కూ అంత‌ర్జాతీయ వాణిజ్య విమాన స‌ర్వీసుల‌ను నిషేధిస్తూ నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ కార‌ణంగా గ‌త ఏడాది మార్చిలో విధించిన ఈ నిషేధం ఇలా ప్ర‌తి నెలా పొడిగించుకుంటూ పోతున్నారు. ఈ సారి ప‌రిస్థితుల్లో మార్పు ఖాయం అని..డిసెంబ‌ర్ నెలాఖ‌రు నాటికి అంతా కుదుట‌ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం దేశం నుంచి ప‌లు అంత‌ర్జాతీయ మార్గాల్లో విమాన స‌ర్వీసులు న‌డుస్తున్నా అవి ప‌రిమిత స్థాయిలోనే ఉంటున్నాయి. ఎయిర్ బ‌బుల్ ఒప్పందాల ప్ర‌కారం ఈ స‌ర్వీసులు న‌డుస్తున్నాయి. దీని వ‌ల్ల ప్ర‌యాణికులు ప‌లు మార్గాల్లో అధిక ఛార్జీలు చెల్లించాల్సి వ‌స్తోంద‌నే విమ‌ర్శ‌లు కూడా విన్పిస్తున్నాయి.

భార‌త్ అమెరికాతోపాటు కెన‌డా, ఫ్రాన్స్, జ‌ర్మ‌నీ, ఇరాక్, మాల్దీవులు, యూఏఈ, యూకె త‌దిత‌ర ప్రాంతాల‌తో క‌లిపి మొత్తం 31 దేశాల‌తో ఎయిర్ బ‌బుల్ ఒప్పందాలు చేసుకుంది. భార‌త్ లోనే కాకుండా ప‌లు దేశాల్లో క‌రోనా కేసులు గ‌ణ‌నీయంగా త‌గ్గుముఖం ప‌ట్టాయి. అయితే ప‌లు దేశాల్లో వైర‌స్ భారీ ఎత్తున విస్త‌రిస్తుండ‌టం కూడా క‌ల‌క‌లం రేపుతోంది. ఎయిర్ లైన్స్ సైతం అంతర్జాతీయ విమాన స‌ర్వీసుల విష‌యంలో ఆచితూచి స్పందిస్తున్నాయి. క‌రోనాకు ముందు ఉన్న ప‌రిస్థితులు ఎప్ప‌టికి వ‌స్తాయ‌నే అంశంపై ఇప్ప‌టికిప్పుడు చెప్ప‌టం క‌ష్టం అవుతుంద‌ని ఇటీవ‌లే విస్తారా ఎయిర్ లైన్స్ కు చెందిన ఉన్న‌తాధికారి ఒక‌రు అభిప్రాయ‌ప‌డ్డారు. అయితే కొద్ది రోజుల క్రిత‌మే కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి జోతిరాదిత్య సింధియా కూడా అంత‌ర్జాతీయ విమాన స‌ర్వీసుల‌ను సాధార‌ణ స్థితికి తెచ్చేందుకు ప‌రిస్థితుల‌ను మ‌దింపు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌పంచంలోని కొన్ని ప్రాంతాల్లో క‌రోనా కేసుల పెరుగుద‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు ఆయ‌న తెలిపారు.

Next Story
Share it