వ్యాక్సిన్ వేసుకున్నారా..పది శాతం రాయితీ అంటున్న ఇండిగో
ఎలా చేసి అయినా బిజినెస్ పెంచుకోవాలి. అసలే కరోనా కాలం. విమాన కంపెనీల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కోలుకున్నట్లే కోలుకున్నా కరోనా సెకండ్ వేవ్ కు మరింత దెబ్బతిన్నాయి ఎయిర్ లైన్స్. మళ్లీ ఇప్పుడిప్పుడే గాడినపడుతున్నాయి. అయినా మరో వైపు థర్డ్ వేవ్ భయం ఉండనే ఉంది. అయితే ఇండిగో ఎయిర్ లైన్స్ కొత్త ఆఫర్ తో ముందుకొచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న ప్రయాణికులకు టిక్కెట్లపై పది శాతం రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించింది. వ్యాక్సిఫేర్ తో నూతన ఆఫర్ ను అందుబాటులోకి తెచ్చింది. 18 సంత్సరాలు దాటిన వ్యాక్సిన్ వేసుకున్న వారికి ఇది వర్తిస్తుంది.
ఒక్క డోసు వేసుకున్న వారికి కూడా రాయితీ వర్తిస్తుందని ఇండిగో వెల్లడించింది. రెండు డోసులు..ఒక్క డోసు వేసుకున్న వారికి ఈ రాయితీ కల్పిస్తున్నారు. ఈ రాయితీ పొందాలంటే వ్యాక్సిన్ వేసుకున్న సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. ఆన్ లైన్ లో చూపించినా కూడా అనుమతిస్తారు. అన్ని రూట్లలో ఇది వర్తించనుంది. అతి పెద్ద విమానయాన సంస్థగా దేశీయ వ్యాక్సినేషన్ ప్రక్రియకు తమ వంతు సాయం అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండిగో చీఫ్ స్ట్రాటజీ, రెవెన్యూ ఆఫీసర్ సంజయ్ కుమార్ వెల్లడించారు.