కేంద్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న ఇండిగో !

దేశంలోని ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లు ఎయిర్ లైన్స్ రంగంలోకి ప్రవేశించేందుకు వీలుగా కేంద్రం తన విధానాల్లో మార్పులు చేసే దిశగా యోచిస్తున్నట్లు ఇటీవల మీడియా లో ప్రముఖంగా వార్తలు వచ్చాయి. ప్రస్తుతం ఉన్న విధానంలో మార్పులు చేస్తే దేశంలో అతి పెద్ద ఎయిర్ పోర్ట్స్ డెవలపర్లుగా ఉన్న అదానీ గ్రూప్ తో పాటు జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ కూడా ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు మార్గం సుగమం అవుతుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ముంబై, ఢిల్లీ వంటి ప్రధాన ఎయిర్ పోర్ట్స్ లు నిర్వహిస్తున్న సంస్థలు ఏవీ కూడా ఎయిర్ లైన్స్ లో పది శాతానికి మించి వాటా కలిగి ఉండటానికి అనుమతించరు. ఈ విధాన మార్పులు కూడా అదానీ గ్రూప్ కోసమే చేస్తున్నారు అని...ఈ మేరకు సంస్థ కేంద్రానికి లేఖలు కూడా రాసినట్లు జాతీయ మీడియా లో వార్తలు వచ్చాయి. అయితే దీనిపై తాజాగా అదానీ ఎంటర్ప్రైజెస్ స్పందించింది. ఈ వార్తలను తోసిపుచ్చుతూ వివరణ ఇచ్చింది. మీడియా లో వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని..ఇవి నిరాధారం అని పేర్కొంది.
ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించాలి అనే ఎలాంటి ప్రతిపాదనను కంపెనీ పరిశీలించటం లేదు అని స్పష్టం చేసింది. దేశీయ విమానయాన సేవల విభాగంలో 90 శాతం మార్కెట్ వాటా కలిగిన ఇండిగో, ఎయిరిండియాల ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయటంతో పాటు మార్కెట్ లో పోటీ పెంచేలా ఈ నిర్ణయం ఉపకరిస్తుంది అని కేంద్రం భావిస్తున్నట్లు చెపుతున్నారు. అదానీ గ్రూప్ దేశ వ్యాప్తంగా ఎనిమిది విమానాశ్రయాలను నిర్వహిస్తుంటే...జీఎంఆర్ గ్రూప్ దేశంలో ఐదు విమానాశ్రయాలను కలిగి ఉంది. పౌరవిమానయాన శాఖ తాజాగా ప్రతిపాదించిన మార్పులపై దేశంలో అత్యధిక మార్కెట్ వాటా కలిగిన ఇండిగో ఎయిర్ లైన్స్ వ్యతిరేకిస్తోంది. ఎయిర్‌పోర్టుల నిర్వాహకులను ఎయిర్‌లైన్స్ వ్యాపారంలోకి అనుమతిస్తే పరస్పర విరుద్ధ ప్రయోజనాలకు తావిచ్చినట్లవుతుందని ఇండిగో సహ వ్యవస్థాపకుడు, ఎండీ రాహుల్ భాటియా అభిప్రాయపడ్డారు. మరి ఈ విషయంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది రాబోయే రోజుల్లో కానీ తేలదు.



