Telugu Gateway
Top Stories

ఇండిగో..మరింత ఎత్తుకు

ఇండిగో..మరింత ఎత్తుకు
X

దేశంలోని ఏ ఎయిర్ పోర్ట్ లో చూసినా ఎక్కువగా కనిపించేది ఇండిగో విమానాలే. ఈ కంపెనీకి ఉన్న విమానాలు ఎక్కువ...అవి నడిపే సర్వీస్ లు కూడా ఎక్కువే. అందుకే ఎక్కడ చూసినా ఇండిగో విమానాలే కనిపిస్తాయి. అంతే కాదు 2024 జనవరి గణాంకాల ప్రకారం చూస్తే 60 శాతం పైగా వాటాతో దేశీయ విమానయాన రంగంలో నంబర్ వన్ ఎయిర్ లైన్స్ గా ఉంది ఇండిగో. 2024 మార్చి నాటికి ఇండిగో వద్ద 350 విమానాలు ఉన్నాయి. దేశీయ, అంతర్జాతీయ రూట్లతో కలుపుకుని ఈ విమానాలు 119 ప్రాంతాలకు రోజుకు ఏకంగా 2000 ఫ్లైట్ సర్వీసులు నడుపుతుంది. ఇండిగో ఎయిర్ లైన్స్ ఇప్పుడు ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఎయిర్ లైన్స్ గా అవతరించింది. ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 .46 లక్షల కోట్ల రూపాయలను అధిగమించటంతో ఇండిగో ఈ ఘనత సాధించింది. సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ను వెనక్కి నెట్టి ఇండిగో మూడవ ప్లేస్ లోకి వచ్చింది.

మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా ప్రపంచంలో ఇప్పుడు నంబర్ వన్ ప్లేస్ లో డెల్టా ఎయిర్ ఉండగా ...రెండవ స్థానంలో ర్యానైర్ హోల్డింగ్స్ ఉన్నాయి. విమానయాన రంగం గత కొన్ని నెలలుగా దూసుకెళుతుండంతో ఇండిగో ఆదాయంతో పాటు లాభాలు కూడా గణనీయంగా పెరిగాయి. దీంతో స్టాక్ మార్కెట్ లో కంపెనీ మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ షేర్లు కూడా దూసుకెళ్లాయి. ఒక్క నెల రోజుల వ్యవధిలోనే ఇండిగో కంపెనీ షేర్లలో 22 శాతం ర్యాలీ వచ్చింది. ఈ బుధవారం నాడే ఇంటర్ గ్లోబ్ షేర్లు 52 వారాల గరిష్ట స్థాయి 3815 రూపాయలకు చేరాయి. ఒక్క రోజే ఈ షేర్ బిఎస్ఈలో 175 రూపాయల లాభం తో 3806 రూపాయల వద్ద ముగిసింది. రాబోయే రోజుల్లో కూడా ఏవియేషన్ రంగానికి ఉజ్వల భవిష్యత్ ఉంటుంది అనే అంచనాల నేపథ్యంలో మరికొంత కాలం ఇండిగో జోష్ కొనసాగే అవకాశం ఉంది అని భావిస్తున్నారు. ఇండిగో విస్తరణ కోసం గత ఏడాది పెద్ద ఎత్తున అంటే ఏకంగా 500 విమానాల కొనుగోలుకు ఎయిర్ బస్ కు ఆర్డర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story
Share it