Telugu Gateway
Top Stories

ఇంధన సర్ ఛార్జ్ పెంచుతూ నిర్ణయం

ఇంధన సర్ ఛార్జ్ పెంచుతూ నిర్ణయం
X

పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఇప్పటికే దేశీయ రూట్లతో పాటు అంతర్జాతీయ రూట్ల లో కూడా విమాన చార్జీలు భారీగా పెరిగాయి. గత ఏడు నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా క్రూడ్ ఆయిల్ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో విమానాల్లో ఇంధనంగా ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటిఎఫ్ ) ధరలు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఎయిర్ లైన్స్ టికెట్ రేట్లు పెంచాయి. ఈ దెబ్బకు చాలా మంది తమ హాలిడే ప్లాన్స్ కూడా వాయిదా వేసుకుంటున్నారు. ఈ తరుణంలో దేశంలో మార్కెట్ వాటా పరంగా ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ఇండిగో ఎయిర్ లైన్స్ ఇంధన సర్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది . ఈ పెరిగిన చార్జీలు అక్టోబర్ ఆరు నుంచే అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గత కొన్ని నెలలుగా ఏటిఎఫ్ ధరల్లో పెద్ద ఎత్తున హెచ్చుతగ్గులు నమోదు అవుతుండటంతో నిర్వహణ వ్యయాలు పెరిగాయి అని..అందులో భాగంగానే దేశీయ ప్రయాణికులతో పాటు అంతర్జాతీయ ప్రయాణికులపైన కూడా ఫ్యూయల్ చార్జీలు వేస్తున్నట్లు ప్రకటించింది.

దూరాన్ని బట్టి ఈ చార్జీలు భారం ఇలా ఉంది. దేశీయ రూట్ల లో 375 రూపాయల నుంచి గరిష్టంగా 1300 రూపాయలు ఫ్యూయల్ చార్జీలు వేయనున్నారు. 500 కిలోమీటర్ల వరకు 375 రూపాయలు..501 నుంచి 1000 కిలోమీటర్ల 600 రూపాయలు, 1001 నుంచి 1500 కిలోమీటర్ల వరకు 900 రూపాయలు , 1501 నుంచి 2000 కిలోమీటర్ల వరకు 1150 రూపాయలు ఫ్యూయల్ చార్జీలు వేస్తున్నారు. 2000 కిలోమీటర్ల పైన గరిష్టంగా 1300 రూపాయలు చార్జీ వసూలు చేయనున్నారు. అంతర్జాతీయ రూట్ల లో ఇది వెయ్యి రూపాయల నుంచి మొదలై గరిష్టంగా 10000 రూపాయల వరకు ఉంది. ప్రాంతాన్ని బట్టి ఈ చార్జీల్లో మార్పులు ఉన్నాయి. ప్రయాణికులపై భారం మోపటం తమకూ విచారంగా ఉంది అని...పరిస్థితిని బట్టి అవసరమైన సర్దుబాట్లు చేస్తామని ప్రకటించారు.

Next Story
Share it