ఇది నమ్మకమే...గ్యారంటీ కాదు!

దేశంలోని విమానాశ్రయాల్లో గందరగోళం పోవటానికి ఇంకా ఎన్ని రోజులు పట్టొచ్చు. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కాకుండా ఎప్పటికి పరిస్థితి గాడిన పడుతుంది. ఈ ప్రశ్నలకు ఇండిగో ఎయిర్ లైన్స్ చెపుతున్న సమాధానం చూస్తుంటే ఇది ఇంకా తక్కువలో తక్కువ మరో మూడు రోజులుపైగానే కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. గత ఆరు రోజులుగా దేశ విమానయాన రంగంలో కొనసాగుతున్న సంక్షోభం మరికొన్ని రోజులు ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది సెటిల్ అవటానికి మరో మూడు రోజులు పట్టడం ఖాయం అని ఈ సమస్యకు ప్రధాన కారణం అయిన ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. తొలుత ఎయిర్ లైన్స్ సర్వీసులు స్టెబిలైజ్ కావటానికి డిసెంబర్ 10 నుంచి 15 వరకూ సమయం పడుతుంది అనుకున్నామని ...కానీ తమకు డిసెంబర్ 10 నాటికే సర్వీసులను స్టెబిలైజ్ చేయగలమని నమ్మకం వచ్చింది అని ఇండిగో ఎయిర్ లైన్స్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో వెల్లడించింది. డిసెంబర్ ఏడున అంటే ఈ ఆదివారం నాడు మొత్తం 1650 విమానాలను ఆపరేట్ చేశామని...ఈ సంఖ్య శనివారం నాడు 1500 అని తెలిపింది.
ఆన్ టైం ఆపరేషన్స్ కూడా 30 శాతం నుంచి 75 శాతానికి మెరుగైనట్లు పేర్కొంది. అదే సమయంలో రద్దు అయిన విమానాలకు సంబంధించిన రిఫండ్, లగేజీ వెనక్కు ఇచ్చే ప్రక్రియ కూడా వేగంగా సాగుతున్నట్లు తన ప్రకటనలో పేర్కొంది. ఇండిగో తాజా పరిస్థితిపై ఆదివారం నాడు ఏకంగా మూడు ప్రకటనలు విడుదల చేసింది. ఈ పరిస్థితి సరిదిద్దెందుకు వెంటనే క్రైసిస్ మేనేజిమెంట్ గ్రూప్ (సిఎంజి) ని ఏర్పాటు చేయాలని ఇండిగో ఎయిర్ లైన్స్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ యాజమాన్యానికి నివేదికలు ఇస్తుంది అని తెలిపారు.
సడన్ గా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఇంత భారీ సమస్య ఉత్పన్నం కావటానికి ఇండిగో ఎయిర్ లైన్స్ యాజమాన్యం నిర్లక్ష్యమే అనే విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మరో వైపు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్ డీ ఎల్ టి) నిబంధనల విషయంలో దేశంలో అతి పెద్ద ఎయిర్ లైన్స్ గా ఉన్న ఇండిగో గడువు నాటికీ సిద్ధం అయిందా లేదా వంటి అంశాలను పరిశీలించాల్సిన డైరెక్టర్ జనరల్ అఫ్ సివిల్ ఏవియేషన్ (డీజిసిఏ) ...పౌర విమానయాన శాఖ లు ఏ మాత్రం బాధ్యతగా వ్యవహరించినట్లు కనిపించటం లేదు అనే చర్చ కూడా సాగుతోంది.



