వేతనాలు పెంచిన ఇండిగో
ఇండిగో ఎయిర్ లైన్స్ సర్వీసులకు ఇటీవల ఒక రోజు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీనికి కారణం ఏమిటీ అంటే చాలా మంది టాటాల చేతికి వచ్చిన ఎయిర్ ఇండియా లో ఇంటర్వ్యూలకు వెళ్ళటమే కారణం అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ రోజు మాత్రం దేశ వ్యాప్తంగా ఇండిగో సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశ విమానయాన రంగం పూర్తి స్థాయిలో కాకపోయినా కోవిడ్ ముందు నాటి పరిస్థితికి చేరుకుటోంది. ప్రయాణికుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దీంతోపాటు కొత్తగా ఆకాశ ఎయిర్ లైన్స్ ఎంట్రీ ఇస్తోంది. కారణాలు ఏమైనా ఇండిగో ఎయిర్ లైన్స్ తాజాగా తన సిబ్బందికి వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ సమయంలో ఇండిగో ఎయిర్ లైన్స్ తన సిబ్బంది వేతనాల్లో 28 శాతం మేర కోత పెట్టింది. గతంలో పెంచిన ఎనిమిది శాతానికి అదనంగా ఇప్పుడు మరో ఎనిమది శాతం మేర వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. విమానయాన రంగం సాధారణ స్థితికి చేరుకున్నా వేతనాలను పాత స్థాయిలో పునరుద్ధరించకపోవటంపై ముఖ్యంగా పైలట్లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని సమాచారం. దీంతో యాజమాన్యం రంగంలోకి దిగి వేతనాల పెంపు నిర్ణయం తీసుకుంది. ఎక్కువ పని గంటలు పనిచేసే పైలట్లకు ఇచ్చే భత్యాలను కూడా పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ తో దేశీయ విమానయాన రంగం తీవ్ర కష్టాల పాలైన విషయం తెలిసిందే.