ఐదేళ్లలో 29 శాతం పెరిగిన చైనా దిగుమతులు
ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే ప్రకటనలు చేస్తారు. బాయ్ కాట్ చైనా అంటూ పిలుపులిస్తారు. కొద్ది రోజుల తర్వాత ఆ విషయం అందరూ మర్చిపోతారు.ఎవరి వ్యాపారం వారిదే. తాజాగా కేంద్రం పార్లమెంట్ కు వెల్లడించిన అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలో భారత్ కు చైనా నుంచి దిగుమతులు 29 శాతం మేర పెరిగినట్లు తేల్చారు. ఇందులో ఖనిజాలు, ఖనిజ ఇంధనాలు, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, అద్దకం పదార్ధాలు, ప్లాస్టిక్, పేపర్, కాటన్, టెక్స్ టైల్ ఫ్యాబ్రిక్స్, ఫుట్ వేర్, గ్లాస్ వేర్, ఐరన్, స్టీల్, కాపర్, బాయిలర్స్ మెరిషనరీ, ఫర్నీచర్ కూడా ఉంది. 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణ నుంచి చైనా నుంచి దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునే పనిలో ఉన్నామని, అందులో భాగంగానే 14 రంగాలకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమ్ తెచ్చామని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ లోక్ సభలో తెలిపారు.
దిగుమతి చేసుకునే వస్తువుల నాణ్యతను పరిశీలించేందుకు సాంకేతిక నిబంధనలు కూడా రూపొందించామని తెలిపారు. గల్వాన్ లోయలో ఘర్షణ అనంతరం భారత్ చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ తోపాటు 59 యాప్ లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. దిగుమతి చేసుకుంటున్న వాటిలో భారత్ లో తయారు చేసుకోలేని అత్యంత సాంకేతిక పరమైన అంశాలతో ముడిపడి ఉన్నవి ఉన్నాయా అంటే అదీలేదు. చివరకు చెప్పులు..ఫర్నీచర్ వంటి వాటిని కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నామంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే దీర్ఘకాలిక..పక్కా ప్రణాళికలు అవసరం అని ఈ రంగంలోని నిపుణులు చెబుతున్నారు.