Telugu Gateway
Top Stories

ప్ర‌పంచ సాంకేతిక రంగాన్ని ఏలుతున్న భార‌తీయులు

ప్ర‌పంచ సాంకేతిక రంగాన్ని ఏలుతున్న భార‌తీయులు
X

ఆరు అమెరికా దిగ్గ‌జ ఐటి కంపెనీల సీఈవోలు భార‌తీయులే

ఒక‌టి కాదు..రెండు కాదు. ఏకంగా అమెరికాకు చెందిన ఆరు దిగ్గ‌జ కంపెనీలను న‌డిపేది భార‌తీయులే. ఇదే అంశంపై మ‌రో అమెరికన్ కంపెనీకి చెందిన సీఈవో ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. ఇది భార‌త్ అద్భుత విజ‌యం అని పేర్కొన్నారు. ఇలా ట్వీట్ చేసిన వ్య‌క్తి స్ట్రైప్ సీఈవో పాట్రిక్ కొలిస‌న్. స్ట్రైప్ ఐరిష్‌-అమెరిక‌న్ ఫైనాన్షియ‌ల్ సేవ‌ల కంపెనీ. ఆయ‌న ట్వీట్ సారాంశం ఇలా ఉంది..'సాంకేతిక ప్ర‌పంచంలో భార‌తీయుల విజ‌యాలు చూస్తుంటే అద్భుతంగా ఉంది. అమెరికాకు చెందిన ఆరు అగ్ర‌శ్రేణి ఐటి సంస్థ‌ల సీఈవోలు భార‌తీయ మూలాలు ఉన్నావారే. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో అల్టో నెట్ వ‌ర్క్స్ సీఈవోలు భార‌తీయ నేప‌థ్యం ఉన్న వారే. ఇప్పుడు ట్విట్ట‌ర్ సీఈవో కూడా.ఇండియ‌న్ అమెరిక‌న్ అయిన ప‌రాగ్ అగ‌ర్వాల్ కానున్నారు' అంటూ ట్వీట్ చేశారు.

మైక్రోసాఫ్ట్ కు స‌త్యానాదెళ్ల సీఈవోగా ఉన్న విష‌యం తెలిసిందే. గూగుల్ సీఈవోగా సుంద‌ర్ పిచాయ్, అడోబ్ సీఈవో గా శంత‌న్ నారాయ‌ణ్, ఐబీఎం సీఈవోగా అర‌వింద్ క్రిష్ణ‌, పాలో అల్టో నెట్ వ‌ర్క్స్ సీఈవోగా నికేష్ అరోరా లు ఉన్నారు. ఇప్పుడు ట్విట్ట‌ర్ సీఈవోగా ఇండియన్-అమెరిక‌న్ ప‌రాగ్ అగ‌ర్వాల్ నియ‌మితులు కానున్నారు. అమెరికా ఐటి రంగానికి భార‌తీయులు అందిస్తున్న సేవ‌లు ఎన్నో. ప్ర‌తి ఏటా ల‌క్షలాది ఐటి నిపుణులు ఉపాధి కోసం అమెరికా బాట ప‌ట్టే విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే ఐటి నిపుణుల సంఖ్య కూడా భారీగానే ఉంటుంది.

Next Story
Share it