కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు...బడ్జెట్ భయాలు కలిపి దేశీయ స్టాక్ మార్కెట్లో సోమవారం నాడు రక్తపాతం జరిగింది. ఏవో కొన్ని షేర్లు మినహా కీలక షేర్లు అన్నీ భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ప్రారంభం నుంచి పతనం కొనసాగుతూ ఉన్నా..మధ్యాహ్నం నుంచి మార్కెట్ పతనం మరింత పెరిగింది. సెన్సెక్స్ ఏకంగా 1545 పాయింట్ల మేర నష్టపోయింది. దీంతో ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఒకప్పుడు ఫ్యాన్సీ షేర్లుగా వెలుగొందినవి కూడా ఇప్పుడు కుప్పకూలాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్టాక్ మార్కెట్ ప్రస్తుతం బేర్స్ గుప్పిట్లోనే ఉంది.జనవరి 17 నుంచి చూస్తే సెన్సెక్స్ ఏకంగా 3900 పాయింట్లు నష్టపోగా...ఇన్వెస్టర్ల సంపద ఒక్క బీఎస్ ఈలోనే ఏకంగా 20 లక్షల కోట్ల రూపాయల మేర గాల్లో కలసిపోయింది. అమెరికాకు చెందిన ఫెడ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉండటంతో ఎఫ్ ఐఐలు కూడా ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లో భారీ ఎత్తున అమ్మకాలు జరిపారు.దీనికి తోడు ఒమిక్రాన్ కారణంగా ఆర్ధిక వ్యవస్థ గాడితప్పుందనే అంచనాలు కూడా మార్కెట్ సెంటిమెంట్ ను దెబ్బతీశాయి.
రష్యా-ఉక్రెయిన్ ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చమురు ధరలపై ప్రభావం పడుతుందనే అంచనాలు కూడా సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. ఇప్పటికే పెరిగిన ఇంథన ధరలు మరింత పెరిగితే ఈ ప్రభావం ఆర్ధిక వ్యవస్థపై ఉంటుందనే అంచనాలు కూడా అమ్మకాలకు కారణం అయ్యాయి. ఇదిలా ఉంటే ఫిన్ టెక్ షేర్లు భారీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ముఖ్యంగా పేటీఎం షేరు 50 శాతానికి పైగా నష్టపోయింది.ఓ దశలో రికార్డు కనిష్ట స్థాయి 881 రూపాయలకు పతనం అయింది. చివరకు కోలుకుని బీఎస్ ఈలో 917 రూపాయల వద్ద ముగిసింది. లిస్టింగ్ నుంచి జోరు చూపించిన జొమాటో షేర్ ధర పతనం కొనసాగింది. సోమవారం నాడు ఈ షేరు ఏకంగా 20 శాతం మేర నష్టపోయి 91.40 రూపాయల వద్ద ముగిసింది. లిస్ట్ అయిన తర్వాత ఈ షేరు తొలిసారి వంద రూపాయలకు దిగువకు వచ్చింది. నైకా, పీబీ ఫిన్ టెక్ వంటి షేర్లది కూడా ఇదే బాట. వీటితోపాటు పలు కీలక రంగాలకు చెందిన షేర్లు కుప్పకూలటంతో ఇన్వెస్టర్లు విలవిలలాడారు.