Telugu Gateway
Top Stories

బిఎస్ఈ సెన్సెక్స్ 2008 పాయింట్లు జంప్

బిఎస్ఈ సెన్సెక్స్ 2008 పాయింట్లు జంప్
X

ఇరాన్ పై యుద్ధం ప్రారంభం అయినప్పటి నుంచి దేశీయ స్టాక్ మార్కెట్ లో రాజ్యమేలుతున్న అనిశ్చితికి త్వరలోనే ముగింపు పడే అవకాశం ఉందా?. అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కు చెందిన రిపబ్లికన్ పార్టీ చావు దెబ్బతినటంతో ఇప్పుడు అంతా సెట్ అవుతుందా?. ఇవే ఇప్పుడు ఇన్వెస్టర్లలో మెదులుతున్న ప్రశ్నలు . అమెరికా మిడ్స్ ఫలితాలు యూఎస్ మార్కెట్లలో కూడా జోష్ తెచ్చిపెట్టాయి. మరో వైపు అదే జోష్ తో భారతీయ స్టాక్ మార్కెట్లో కూడా దీపావళి ముందే వచ్చేసింది. గురువారం నాడు బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 2008 పాయింట్ల లాభంతో ముగిసింది అంటే అమెరికా ఎన్నికల ఫలితాలు మార్కెట్లపై ఎంత ప్రభావం చూపించాయో అర్ధం అవుతోంది. డోనాల్డ్ ట్రంప్ కు తగిలిన షాక్ తో ఇరాన్ పై యుద్ధం విషయంతో పాటు పలు కీలక అంశాల్లో గతంలో చూపించిన తరహాలో డోనాల్డ్ ట్రంప్ దూకుడు చూపించే ఛాన్సులు బాగా తగ్గిపోతాయి.

ఈ కారణంతోనే చమురు ధరలు ఏకంగా రెండు నెలల కనిష్ట స్థాయి 93 డాలర్లకు పతనం అయ్యాయి. మరో వైపు డాలర్ తో పోలిస్తే రూపాయి కూడా బలపడింది. ఇలా ఒకటేమిటి పలు అంశాలు కలిసి రావటంతో అటు బిఎస్ఈ..ఇటు ఎన్ఎస్ఈ సూచీలు ఉరకలేశాయి. నిఫ్టీ 24500 పాయింట్ల ని అధిగమించింది. ఈ ఒక్క రోజులోనే బిఎస్ఈ లో నమోదు అయిన కంపెనీల విలువ ఏకంగా ఎనిమిది లక్షల కోట్ల రూపాయల మేర పెరిగింది. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలు.. ముడి చమురు ధరలు 8 శాతానికి పైగా పడిపోవడం దేశీయ మార్కెట్లకు సానుకూలంగా మారాయి. అంతర్జాతీయ చమురు మార్కెట్లో ధరల తగ్గుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. చమురు ధరలు తగ్గడం వల్ల భారత్‌కు దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు కూడా తగ్గే అవకాశం ఉందన్న అంచనాలు మార్కెట్‌లో ఉత్సాహాన్ని పెంచాయి. మరి రాబోయే రోజుల్లో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఎలాంటి అడుగులు వేస్తారు అన్న దానిపైనే మార్కెట్ గమనం ఆధారపడి ఉంటుంది.

Next Story
Share it