Telugu Gateway
Top Stories

మూడు నెలల్లో 48 లక్షల కోట్లు ఉఫ్!

మూడు నెలల్లో  48 లక్షల కోట్లు ఉఫ్!
X

దేశీయ స్టాక్ మార్కెట్లు గతంలో ఎన్నడూ లేని పతనాన్ని చవిచూస్తున్నాయి. గత 15 సంవత్సరాల కాలంలో స్టాక్ మార్కెట్ లు ఇంతలా పతనం అయిన సందర్భం లేదు. 2026 సంవత్సరంలోనే అంటే కొత్త ఏడాదిలోకి ప్రవేశించి ఇంకా నిండా మూడు నెలలు కూడా కాకముందే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 533 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయింది. మన ఇండియన్ కరెన్సీలో అయితే ఈ మొత్తం ఏకంగా దగ్గర దగ్గర 48 లక్షల కోట్ల రూపాయలు. 2011 సంవత్సరం తర్వాత స్టాక్ మార్కెట్ లో ఇంతటి పతనం ఇదే మొదటి సారి అని మనీ కంట్రోల్ .కామ్ తన కథనంలో ప్రస్తావించింది. కొన్ని రోజులు అమెరికా సుంకాల వ్యవహారం మార్కెట్ ను కుదిపేయగా...తర్వాత ఏఐ భయాలతో ఐటి స్టాక్స్ భారీ ఎత్తున అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అంతా సద్దుమణిగింది అనుకుంటున్న వేళ ఫిబ్రవరి 28 న అమెరికా-ఇజ్రాయిల్ లు సంయుక్తంగా ఇరాన్ పై దాడికి దిగటంతో మార్కెట్లు మరో సారి భారీ నష్టాల్లోకి వెళ్లాయి.

ఈ యుద్ధం స్టార్ట్ అయి రెండు వారాలు కావస్తున్నా కూడా దీనికి ముగింపు ఎప్పుడు...ఎలా ఉంటుందో ఎవరికీ అంతు చిక్కటం లేదు. ఒక వైపు అమెరికా, మరో వైపు ఇరాన్ లు ఇంకా సవాళ్లు విసురుకుంటూనే ఉన్నాయి. ఈ యుద్ధంతో ముడి చమురు ధర బ్యారెల్ వంద డాలర్లను అధిగమించటంతో ఒక్కసారిగా ప్రపంచ మార్కెట్ లు కూడా ఉలిక్కిపడ్డాయి. చమురు ధరలతో పాటు గ్యాస్ సమస్య కారణంగా రాబోయే రోజుల్లో ద్రవ్యోల్భణం పెరిగి ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఆయిల్ ధరలతో డాలర్ తో రూపాయి విలువ రోజుకో కొత్త కనిష్ట స్థాయి కి చేరుతోంది. ఇది కూడా రాబోయే రోజుల్లో ఎన్నో సమస్యలకు కారణం అవుతుంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. యుద్ధం ఇలాగే మరికొన్ని రోజులు కొనసాగితే చమురు ధరలు మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

పలు దేశాలు ఇప్పటికే తమ దగ్గర ఉన్న రిజర్వులను బయటకు తీస్తున్నా కూడా అంతర్జాతీయంగా ధరల స్థిరీకరణకు ఇవి ఏ మేరకు ఉపయోగపడతాయో వేచిచూడాల్సిందే. ఈ శుక్రవారం నాడు కూడా స్టాక్ మార్కెట్ లు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఒక్కరోజే మార్కెట్ విలువ పది లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయింది. బిఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1470 పాయింట్ల నష్టంతో 74563 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 23151 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. గత కొన్ని రోజులుగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) లు దేశీయ మార్కెట్ లో పెద్ద ఎత్తున అమ్మకలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది సెన్సెక్స్ ఏకంగా లక్ష పాయింట్లకు టచ్ అవుతుంది అని అంచనాలు వెలువడిన వేళ ఎవరూ ఊహించని పరిణామాలతో మార్కెట్లు భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. మరికొన్ని రోజులు కూడా మార్కెట్ లో ఇదే అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది అనే అంచనాలు ఉన్నాయి. మార్కెట్ తిరిగి పరుగులు తీయాలంటే ఎన్నో విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది అని ఈ రంగంలోని నిపుణులు చెపుతున్నారు.

Next Story
Share it