Telugu Gateway
Top Stories

ఐటి రంగంలో మళ్ళీ పాత రోజులు ఎప్పుడో

ఐటి రంగంలో మళ్ళీ పాత రోజులు ఎప్పుడో
X

ఒక వైపు ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెన్షన్. మరో వైపు ఐటి రంగంలో మాంద్యం భయాలు. ప్రపంచ వ్యాప్తంగా గత ఏడాది కాలంలో దిగ్గజ ఐటి కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పటికి ఆ తొలగింపులు కొనసాగుతూనే ఉన్నాయి. అదే సమయంలో పలు కంపెనీ లు కొత్త గా తీసుకునే ఉద్యోగుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. చాలా మందికి ఆఫర్ లెటర్స్ వచ్చినా తుది పిలుపులు మాత్రం రావటం లేదు. దీంతో వచ్చే ఏడాది...రెండేళ్ల పాటు ఐటి రంగంలో వృద్ధి రేటు పరిమితంగా ఉంటుంది అని అంచనాలు వెలువడుతున్నాయి. ఇది కచ్చితంగా కొత్త ఉద్యోగాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది అని నిపుణులు చెపుతున్నారు. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా కూడా ఐటి రంగంపై తాజాగా కీలక అంచనాలను వెలువరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగం ప్రగతి మరింత తగ్గి ఇది ఐదు నుంచి ఆరు శాతానికి పరిమితం అయ్యే అవకాశం ఉంది అని తెలిపింది. నాస్కామ్ లెక్కల ప్రకారం 2022 -23 ఆర్థిక సంవత్సరంలో ఐటి రంగం వృద్ధి రేటు 8 .4 శాతానికి పరిమితం అయింది. అంతకు ముందు ఏడాది ఇది ఏకంగా 15 శాతం ఉండటం గమనార్హం.

ప్రస్తుత దేశ ఐటి పరిశ్రమ మార్కెట్ విలువ 20 . 65 లక్షల కోట్ల రాపాయులుగా ఉంటుంది అని అంచనా. అగ్ర రాజ్యం అమెరికా తో పాటు పలు కీలక ఆర్థిక వ్యవస్థల్లో నెలకొన్న ఆర్థిక ఒత్తిడులు కూడా ఐటి రంగంపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అమెరికా లో చోటుచేసుకున్న బ్యాంకింగ్ సంక్షోభం కారణంగా ఈ రంగం నుంచి వచ్చే ఆర్డర్ లు కూడా తగ్గుముఖం పట్టాయి. దేశంలోని టాప్ ఐదు ఐటి కంపెనీలు గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం 83906 మందిని నియమించుకున్నాయి. 2021 -22 సంవత్సరంలో ఈ నియామకాలు ఏకంగా 2 .73 లక్షలుగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ నియామకాలు మందకొడిగానే ఉండే అవకాశం ఉంది అని ఇక్రా చెపుతోంది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కొత్త ఐటి ఉద్యోగాలు టార్గెట్ చేసుకున్న వారికి ఒకింత గడ్డుకాలమే అని చెప్పాలి.

Next Story
Share it